తెలుగుతెరపైకి కృష్ణ కుటుంబం నుంచి నవీన్ విజయ్‌కృష్ణ రూపంలో మరో వారసుడొచ్చాడు. విజయనిర్మల మనవడిగా,నటుడు నరేష్ తనయుడిగా నవీన్ విజయ్ కృష్ణ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఎడిటర్‌గా ప్రయాణం మొదలెట్టిన నవీన్ హీరో కావాలన్న కోరికగతో 130 కిలోలున్న ఆయన సగానికి తగ్గారు. హీరో మహేష్ బాబు…ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేయడంతో ‘నందిని నర్సింగ్ హోమ్’పై ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. మరి నవీన్ విజయకృష్ణ ఈ చిత్రంలో ఎలా చేశాడు? నానమ్మ, తండ్రి బాటలో నటనకు న్యాయం చేయగలిగాడా? నందిని నర్సింగ్ హోమ్‌లో ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:
చంద్రశేఖర్(నవీన్ విజయకృష్ణ) ఓ మధ్య తరగతి కుర్రాడు. ఓ బ్యాంకులో లోన్ రికవరీ మెన్‌గా సేల్స్ విభాగంలో పనిచేస్తుంటాడు. పక్కనే ఉన్న గర్ల్స్ హాస్టల్ లో శ్రావ్య అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా చందుని ఇష్టపడుతుంది. ఇంతలో చందు ఉద్యోగం పోవడంతో పైసామే పరమాత్మ అని నమ్మే శ్రావ్య దూరమైపోతుంది. దీంతో ప్రేమపై నమ్మకం కొల్పోయిన చందు…మరో ఉద్యోగం సంపాదించడానికి స్నేహితుడైన నాయుడు(షకలక శంకర్)సాయంతో నకిలీ సర్టిపికెట్లతో నందిని నర్సింగ్ హోమ్‌లో డాక్టర్‌గా చేరతాడు.
ఆసుపత్రిలో చందు తీరు చూసి అతనిపై నందిని నర్సింగ్ హోమ్ అధిపతి నందిని (నిత్య) మనసు పారేసుకుంటుంది. అసలు నందిని నర్సింగ్ హోమ్‌లో జరిగిన మిస్టరీలు ఏంటి? డాక్టర్ వెంకటేశ్వర్లు (జయప్రకాశ్ రెడ్డి) జాతకాల పిచ్చి ఎలాంటిది? చందు శ్రావ్యను పెళ్లి చేసుకున్నాడా? నందిని ప్రేమ ఏమైంది? లాంటి విషయాలు తెలియాలంటే తెర మీద సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్:
హీరోగా నవీన్ విజయకృష్ణకి తొలిసినిమా ఐనా చాలా బాగా నటించి అందరిని మెప్పించాడు. చక్కని హాస్యాన్ని పండించి ప్రేక్షకులను కట్టిపడేశాడు. హీరో,హీరోయిన్లు తమ పాత్రల్లో బాగానే చేశారు. డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలో శ్రావ్య చక్కగా ఒదిగిపోయింది.
క్రైమ్ కామెడీ కథతో తెరకెక్కిన చిత్రంలో మధ్యలో దెయ్యం అంటూ హారర్ అంశాన్ని జోడించి తెరకెక్కించాడు దర్శకుడు. ఆస్పత్రికి వైద్యం కోసం కాకుండా వచ్చే రకరకాల పాత్రల్ని వాడుకుంటూ వినోదం పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కరుడు గట్టిన గొలుసు దొంగ గణేష్‌గా వెన్నెల కిషోర్.. మేల్ నర్స్ నాయుడుగా షకలక శంకర్.. ఆసుపత్రిని తన బిజినెస్‌కి అడ్డాగా మార్చుకొన్న పాత్రలో సప్తగిరి.. సీనియర్ డాక్టర్‌గా జయప్రకాష్‌రెడ్డి పంచే కామెడీనే సినిమాకి కీలకం. ముఖ్యంగా షకలక శంకర్ శ్రీకాకుళం యాసతో మాట్లాడే మాటలు.. కోమాలో ఉన్న పేషంట్‌గా వెన్నెల కిషోర్ నటన కడుపుబ్బా నవ్విస్తాయి.
మైనస్ పాయింట్:
రీరికార్డింగ్ హారర్ పరంగా బాగానే ఉన్నా మిగిలిన సన్నివేశాల్లో పేలవంగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో దెయ్యం అంటూ ఒక్కసారిగా హడావుడి మొదలుకావడం.. ఆ వెంటనే ఆ విషయాన్ని పక్కన పెట్టి వేరే అంశాలతో కథని నడిపించడం ప్రేక్షకుడిని అయోమయానికి గురి చేస్తాయి. ఆ ప్రయత్నంలో కథలో వేగం తగ్గినట్లుగా అనిపిస్తుంది.
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు పివి గిరి స్క్రీన్‌ప్లేను గ్రిప్పింగ్‌గా రాసుకున్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో జరుగుతున్న అన్యాయాలను చూపిస్తూనే, మరోవైపు కన్న పిల్లలపై తల్లిదండ్రులకు ఎలాంటి ప్రేమ ఉంటుంది? ఆ ప్రేమతో వాళ్లు ఎంత వరకూ వెళతారు? అనే అద్భుతంగా తెరకెక్కించారు. శివేంద్ర కెమెరా పనితనం.. శేఖర్ చంద్ర.. అచ్చు సంగీతం ఆకట్టుకుంటుంది. కథలో బోలెడన్ని లేయర్లు ఉన్నప్పటికీ ఎక్కడా గందరగోళం లేకుండా సన్నివేశాల్ని తీర్చిదిద్దారు దర్శకులు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
హీరోగా నిలదొక్కుకోవాలనే తపన నవీన్‌లో కనిపించింది.మధ్య తరగతి సేల్స్ మెన్‌గా, నర్సింగ్ హోమ్‌లో డాక్టర్‌గా, ఎదుటివారికి సాయపడాలన్న మనస్తత్వం కలిగిన కుర్రాడిగా నవీన్ చక్కటి ప్రతిభ కనబర్చాడు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు దర్శకుడు స్క్రీన్‌ప్లేను గ్రిప్పింగ్‌గా రాసుకున్నారు. అక్కడక్కడా కొన్ని షాట్‌లు మినహాయిస్తే సినిమా మొత్తం హాయిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అన్నిటికీ మించి సినిమాలో అడుగడుగునా ఉన్న కామెడీ ప్రేక్షకులకు రిలీఫ్ నిస్తుంది. మొత్తంగా తొలిసినిమా నందిని నర్సింగ్ హోమ్‌తో నవీన్ విజయ్‌కృష్ణ ప్రేక్షకులను మెప్పించాడనే చెప్పాలి.
విడుదల తేదీ: 21/10/2016
రేటింగ్: 3 /5
నటీనటులు: నవీన్ విజయ్‌కృష్ణ, శ్రావ్య, నిత్యా నరేష్
సంగీతం: అచ్చు
నిర్మాతలు: రాధాకిషోర్,భిక్షమయ్య
దర్శకత్వం: పి.వి.గిరి