బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను కృష్ణ జింకల కేసు వదలడం లేదు. ఈ కేసులో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సల్మాన్‌కు వ్యతిరేకంగా రాజస్థాన్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సందర్భంగా జోధ్ పూర్ అటవీ ప్రాంతంలో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడినట్టు రెండు కేసులు నమొదయ్యాయి. అతడు దోషేనని జోధ్ పూర్లోని ట్రయల్ కోర్టు తేల్చి చెప్పింది. ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. మరో కేసులో ఏడాదిజైలు శిక్ష విధించింది. సల్మాన్ జైలుకు వెళ్లాడు. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందాడు.
తర్వాత ఈ తీర్పును సవాలు చేస్తూ.. సల్మాన్ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ జులై 25న తీర్పు వెల్లడించింది.తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించడంతో సల్మాన్‌కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.
సల్మాన్ కు కేసులు కొత్త కాదు. ముంబైలో హిట్ అండ్ రన్ కేసులోనూ అతడు దోషేనని ట్రయల్ కోర్టు తేల్చి చెప్పింది. ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే బాంబే హైకోర్టు మాత్రం అతడు నిర్దోషి అని తీర్పుచెప్పింది. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.