తెలుగు తెరపై విలనిజాన్ని …కామెడీని అద్భుతంగా పండించిన నటుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న యాక్టర్ జయప్రకాశ్ రెడ్డి. కబడ్డీ …కబడ్డీ సినిమాలో యాందిరాబ్బీ అంటూ ఆయన పలికిన డైలాగ్‌లు ఇప్పటికి అందరికి గుర్తుండే ఉంటాయి. కెరీర్ తొలినాళ్లలో విలన్‌గా భయపెట్టించిన జయప్రకాశ్ రెడ్డి తర్వాత విలన్‌గా కామెడీని పండించి నవ్వులు పూయించాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాలు చేసిన తర్వాత అప్పుల్లో మునిగిపోయానని చెప్పారు. చాలామంది నిర్మాతలు డబ్బు ఇవ్వలేదని కొంతమంది ఫ్రీగా చేయించుకున్నారని చెప్పారు. అప్పులు చేస్తూ 9 సంవత్సరాల పాటు నా భార్యా బిడ్డలను చూసుకున్నాను. ఇంకా ఇక్కడే వుంటే ఇంకా ఇబ్బంది పడిపోతానని ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోయానని తెలిపారు.
స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ ఉళ్లో ఉన్న తనకు ఐదు సంవత్సరాల తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చినా వెళ్లలేదని చెప్పారు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడంతో రాయలసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ కావడంతో ఇక్కడి భాష,యాస బాగ అలవాటైందన్నారు.
మా నాన్న నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అని చెప్పిన జయప్రకాశ్ రెడ్డి…..ఆయన నిజాయితే మమ్మల్ని ఈ స్ధాయిలో నిలబెట్టిందన్నారు. చిన్నప్పుడు అందరూ నాది చట్టిముక్కు .. చట్టిముక్కు అనేవాళ్లు. సినిమాల్లోకి వచ్చిన తరువాత కొంతమంది నా ముక్కు నిటారుగా వుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సర్జరీ చేయించుకోవడానికి కేరళ వెళ్లానని తెలిపిన ఆయన ఆ డాక్టర్ కారు ప్రమాదంలో చనిపోవడంతో ఇక వెరే డాక్టర్ దగ్గరికి వెళ్లలేదన్నారు.