రైతుకు పెట్టుబడి సాయాన్ని అందించే నిమిత్తం తెలంగాణలో రైతు బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు ఎకరానికి ఎనిమిది వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో నాలుగేసి వేలను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్‌కు సాయం అందింది. మహబూబ్ నగర్ జిల్లా కమ్మదనం గ్రామంలో హరీశ్ శంకర్ కొంత భూమి ఉంది.
అయితే, ఆ మొత్తాన్ని పేదరైతుకు ఇవ్వాల్సిందిగా హరీష్ శంకర్ కోరారు. షాద్ నగర్ ఎమ్మెల్మే అంజయ్య సమక్షంలో కమ్మదనం గ్రామ సర్పంచ్ కు ఈ చెక్కును తిరిగి ఇచ్చేసిన హరీష్ శంకర్ మాట్లాడుతూ, ‘రైతుబంధు’ పథకం ఎంతో ఉన్నతమైందని ప్రశంసించారు. తనకు రైతుబంధు పథకం కింద కొంత మొత్తం వచ్చిందని, పేదరైతు సహాయార్థం ఈ మొత్తం వాడితే బాగుంటుందని చెప్పిన హరీష్ శంకర్, ఈ మొత్తానికి తాను ఇంకొంత మొత్తం కలిపి సర్పంచ్ కు అందజేసినట్టు చెప్పారు.