కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కన్నడనాట రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఏ పార్టీతో మద్దతు లేకుండా గెలిస్తామని భావించిన కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగలగా… మరోసారి సీఎం పదవి చేపడతానని భావించిన సిద్దరామయ్య ఆశలు ఆవిరయ్యాయి. కాంగ్రెస్ 78 సీట్లకే పరిమితం కాగా 104 స్ధానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో జేడీఎస్ కింగ్ మేకర్ గా మారింది.
ఈ నేపథ్యంలో తన సీఎం పదవికి రాజీనామా చేశారు సిద్దరామయ్య. ప్రజల తీర్పును శిరసాహిస్తానని చెప్పారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయన బాదామి,చాముండేశ్వరి నుంచి బరిలోకి దిగగా అతితక్కువ మెజార్టీతో బాదామి నుంచి గెలుపొందారు.
కాంగ్రెస్ ఓటమితో విధాన సౌధలోని సీఎం సిద్దరామయ్య కార్యాలయానికి ఆయన రాజీనామా చేయకముందే సిబ్బంది తాళం వేస్తుండగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సిద్దరామయ్య రాజకీయ జీవితం ముగిసిపోయిందని …జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆయన్ని అధికారానికి దూరంగా పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ నేత కుమారస్వామి గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ఇచ్చిన మద్దతును తాము అంగీకరించామని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కుమారస్వామి ఆ లేఖలో గవర్నర్‌ను కోరారు.