‘మనసా’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి శ్రీదివ్య. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బస్‌స్టాప్’, మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’, ‘కేరింత’ వంటి సినిమాల్లో అందరికీ గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ తెలుగులో శ్రీదివ్యకు ఆశించిన ఆదరణ లభించలేదు. ఆమె టాలెంట్‌ను తమిళ చిత్ర పరిశ్రమ గుర్తించింది. ఒక్కసారిగా తెలుగు సినిమాలకు దూరమైపోయింది శ్రీదివ్య.
తమిళ్‌లో లెక్కకు మించిన సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయిపోయింది. అయితే ఒక తెలుగు అమ్మాయిగా తెలుగు సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలన్నది శ్రీదివ్య కోరిక. మన దర్శకనిర్మాతలు మాత్రం పరభాషా హీరోయిన్లను దిగుమతి చేసుకునే పనిలోనే ఉన్నారు తప్ప తెలుగు అమ్మాయిల టాలెంట్‌ను గుర్తించలేకపోతున్నారు. అయితే తమిళ ఇండస్ట్రీ శ్రీదివ్యను సాదరంగా ఆహ్వానించింది. తన అందంతో, అభినయంతో తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
పరభాషా చిత్రాల్లో నటించి ఎంత పేరు తెచ్చుకున్నా తెలుగు సినిమాల్లో తన ప్రతిభకు తగ్గ గుర్తింపు తెచ్చుకోవాలన్న కోరిక తప్పకుండా ఉంటుంది. తాజాగా శ్రీదివ్య మీడియాకు విడుదల చేసిన ఫోటోలను చూస్తుంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే కాదు, ట్రెండీగా ఉండే గ్లామర్ క్యారెక్టర్స్ కూడా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తోంది.