ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ వివాహం సందర్భంగా పాట్నాలో శనివారం సందడి వాతావరణం నెలకొంది. వీఐపీలు, వివిధ పార్టీల నేతలు సహా మొత్తం 7 వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. వీరికి బస ఏర్పాటు చేసేందుకు కొన్ని కొత్త ఫైవ్‌స్టార్ హోటళ్లలో పెద్ద ఎత్తున రూమ్‌లు బుక్ చేయడంతో పాటు పలు అతిథి గృహాలను సిద్ధం చేశారు.
ఆర్‌జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌ను తేజ్ ప్రతాప్ మనువాడబోతున్నారు. దాణా కుంభకోణ కేసుల్లో ఇన్ని రోజులు జైలులో ఉన్న లాలూ, కొడుకు పెళ్లి వేడుక కోసం బుధవారం పెరోల్‌పై బయటికి విడుదలయ్యారు. తేజ్‌కు జరిగే అన్ని వేడుకలను తల్లి రబ్రీదేవీ దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. లాలూ సైతం ఈ వేడుకలను ఎంతో సంతోషంతో ఆస్వాదిస్తున్నారు. లాలు ఇంట్లో పెళ్లి చిరకాలం గుర్తుండి పోయేలా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్జేడీ నేతలు వినూత్న రీతిలో అభినందనలు, బహుమతులతో ముంచెత్తుతున్నారు.
ఈ సందర్భంగా లాలూ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరిని ఆకట్టుకుంటోంది.శివ,పార్వతుల రూపంలో తేజ్ ప్రతాప్-ఐశ్వర్య ఫోటోలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో లాలూతో పాటు రబ్రీ దేవి కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాద్ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్‌లు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. పాట్నాలోని వెటిరినరీ కాలేజీ కాంపౌండ్‌లో వీరి వివాహం జరుగబోతోంది.