ఏపీ పర్యాటక శాఖ మంత్రి, దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తె భూమా అఖిలప్రియ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. మంత్రి నారాయణ అల్లుడు సోదరుడు భార్గవ్ ను ఆమె పెళ్లాడబోతున్నారు. వీరి నిశ్చితార్థం హైదరాబాదులోని అఖిలప్రియ నివాసంలో కుటుంబసభ్యులు, బంధువుల మధ్య ఘనంగా జరిగింది.
ఏపీ మంత్రి నారాయణ పెద్ద అల్లుడి సోదరుడే భార్గవ్. మాజీ డీజీపీ సాంబశివరావుకు కూడా ఈయన బంధువు అవుతారని సమాచారం. గత కొద్ది కాలంగా అఖిలప్రియ, భార్గవ ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. వీరి వివాహం ఆగస్టు 29వ తేదీన జరగనున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
తన తల్లిదండ్రులు శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలను కోల్పోయిన అఖిలప్రియ అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత మంత్రి పదవిని చేపట్టారు. బార్గవ్ పలు వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల ప్రియకు ఇది రెండో పెళ్లి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి కొడుకుతో అఖిల ప్రియకు గతంలో వివాహమైంది. ఆ తర్వాతి ఏడాదికే విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది.