ఎప్పుడు వివాదాస్పదలతో వార్తల్లో నిలుస్తుంటాడు రాం గోపాల్ వర్మ. తన మాటలతో.. వ్యాఖ్యలతో.. పోస్టులతో సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తుంటారాయన. ఎప్పుడేం మాట్లాడతారో అర్థం కాని వర్మను విపరీతంగా అభిమానించే వారు ఎంతమంది ఉంటారో.. అంతే మంది ఆయన తీరును తప్పు బట్టేవారు కూడా ఉంటారు. అసలు విషయం ఎంటంటే.. దర్శకుడు రాంగోపాల్ వర్మ లేకపోతే తనకు జీవితమే లేకుండా పోయేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సివిల్స్ టాపర్ యడవల్లి అక్షయ్ కుమార్‌ను ఆర్జీవీ ఆశ్చర్యపరిచాడు.
అక్షయ్‌తో సెల్ఫీ దిగి దానిని ట్విట్టర్లో పోస్టు చేశాడు. దానికి ‘సివిల్స్ టాపర్‌తో ఫెయిలైన సివిల్ ఇంజినీర్’ అని క్యాప్షన్ తగిలించాడు. ఆర్జీవీ లాంటి దర్శకుడు స్వయంగా తనతో సెల్ఫీ దిగి దానిని ట్వీట్ చేయడంతో అక్షయ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇటీవల ఓ వెబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ..
తాను సివిల్స్‌లో సత్తా చాటడానికి రాంగోపాల్ వర్మే కారణమని, ఆయనే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నాడు. పరీక్షలకు ముందు రోజు కూడా వర్మ వీడియోలు యూట్యూబ్‌లో పోస్ట్ అయితే వాటిని చూశాకే నిద్రపోయేవాడినని చెప్పాడు. గొప్ప గొప్ప తత్వవేత్తలను వర్మ చిన్న వయసులోనే చదివేశారని, అంతమందిని తాను చదవలేనని, తాను వర్మను చదివితే సరిపోతుంది అనుకున్నానని చెప్పాడు.
సమాజంలోని క్రైమ్‌ను వర్మ చూసే విధానం తనకు చాలా నచ్చిందని, ఆర్జీవీని ఒక్కసారి కలవాలని ఎంతో ఆశగా ఉందని అన్నాడు. అక్షయ్ మాటలకు ఫిదా అయిన వర్మ ఒకసారి ఇద్దరం కలుద్దామని, విద్యావ్యవస్థ గురించి చర్చిద్దామని ట్వీట్ చేశాడు.
A Civils Topper and a Failed Civil Engineer pic.twitter.com/u8DJ8tZHw5
— Ram Gopal Varma (@RGVzoomin) May 10, 2018