దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో దారుణంపై సీబీఐ తాజాగా సంచలన నిజాన్ని బయటపెట్టింది. ఇప్పటివరకూ ఆరోపణలుగా ఉన్నట్లు ఉన్నావో బాలికపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ రేప్ చేసిన మాట నిజమేనని తేల్చింది. గతేడాది జూన్ 4న ఉత్తరప్రదేశ్‌లోని మఖీ గ్రామంలో ఎమ్మెల్యే కుల్‌దీప్ తన సహాయకురాలు శశిసింగ్ సాయంతో యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు సీబీఐ నిర్దారించింది.
ఆ సమయంలో సెక్యూరిటీ గార్డు గది బయట ఉన్నట్లు సీబీఐ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. యూపీ పోలీసులు అత్యాచారం కేసులో ఎమ్మెల్యే సహా మరికొంతమందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా..వారిని కాపాడే ప్రయత్నం చేశారని తెలిపారు. బాధిత యువతి మెడికల్ ఎగ్జామినేషన్‌లో యూపీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఆమె దుస్తులను కూడా ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపించలేదని సీబీఐ వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా మేజిస్ట్రేట్ ముందు బాధితురాలి వాంగ్మూలం తీసుకుని..ఆ సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు.
జూన్ 20న ఈ ఘటనపై కేసు నమోదైనప్పటికీ నిందితుల పట్ల యూపీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో..యూపీ ప్రభుత్వం కేసును సీబీఐ అప్పగించింది. దీంతో సీబీఐ ఏప్రిల్ 13న సెంగర్‌తోపాటు శశిసింగ్, ఇతర నిందితులను అరెస్ట్ చేసి పలు ధపాలుగా విచారించి నిర్దారణకు వచ్చింది.