ఐపీఎల్-11 ఆసక్తికరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేసులో సన్ రైజర్స్, చెన్నై సమీపంలో ఉండగా మిగితా రెండు స్ధానాల కోసం వివిధ జట్లు పోటీ పడుతున్నాయి. తక్కువ స్కోరు చేసిన సన్ రైజర్స్ బౌలింగ్‌లో రాణిస్తుండటంతో హైదరాబాద్ టైటిల్ సాధిస్తుందనే ధీమాతో ఉన్నారు ఫ్యాన్స్. మరోవైపు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించింది ఐపీఎల్ యాజమాన్యం. రాత్రివరకు టీవీలకు అతుక్కుపోయి ఉండకుండా,గ్రౌండ్‌లలో లైవ్ మ్యాచ్ చూసే వారికి ఇబ్బంది కలగకుండా టైమింగ్స్‌లో మార్పులు చేసింది.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్,ఫైనల్ మ్యాచ్‌లు 7 గంటలకే ప్రారంభమవుతాయని ఛైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఎందుకంటే స్లో ఓవర్ రేట్‌ల కారణంగా కొన్ని మ్యాచ్‌లు ఒక్కోసారి రాత్రి 12 దాకా కూడా సాగుతున్నాయి. స్టేడియాల నుంచి అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లే అభిమానులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు టీవీల్లో చూసేవాళ్లు కూడా ఉదయాన్నే పనులకు వెళ్లడం కష్టమవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజీవ్ శుక్లా తెలిపారు.
సాధారణంగా రాత్రి 8 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లు 7 గంటలకే ప్రారంభమవుతాయని శుక్లా చెప్పారు. మే 23, 25న రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నాయి.ముంబైలోని వాంఖడె స్టేడియం మే 22న జరిగే క్వాలిఫయర్ 1తో పాటు మే 27న జరిగే ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి.