ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ ఇటీవలే దాణా కుంభకోణంలో దోషిగా తేలి శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా లాలూను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కలిశారు. లాలూతో కాసేపు ముచ్చటించిన రాహుల్..కొద్దిసేపటికే అక్కడనుంచి వచ్చేశారు.
అయితే వీరిద్దరి భేటీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో లాలూ ప్రసాద్‌ను రాహుల్ కలవడమేంటనే చర్చలు ఊపందుకున్నాయి. కాగా..రాహుల్..లాలూని కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, కేవలం లాలూను మర్యాదపూర్వకంగా కలిసేందుకు మాత్రమే రాహుల్ వెళ్ళినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
ఇదిలా ఉండగా..కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురైన లాలూ రాంచీలోని రిమ్స్ లో చేరారు. కాని అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో… అక్కడి డాక్టర్లు ఢిల్లీ ఎయిమ్స్‌కు రిఫర్ చేశారు. గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు… డాక్టర్ నవీత్ విగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన డాక్టర్ల బృందం వైద్యాన్ని అందిస్తోంది.