బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు శుభవార్త. వచ్చే నెలలో దేశ వ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ వెల్లడించారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో 4జీ సేవలు ప్రారంభించిన బీఎస్‌ఎన్‌ఎల్ వచ్చే నెలలో దేశ వ్యాప్తంగా 21 ప్రాంతాలలో 4జీ సేవలను అందిచనున్నట్లు ఈ సందర్బంగా ఆయన వెల్లడించారు. వినియోగదారులు తమ 2జీ, 3జీ సిమ్ కార్డులను రూ.20 నామమాత్రపు చార్జితో 4జీ సిమ్ గా అప్‌గ్రేడ్ చేసుకోవలసి ఉంటుంది.
ఈ మధ్యే బీఎస్‌ఎన్‌ఎల్ కర్ణాటకలోని శివమొగ్గ సిటీలో 4జీ మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేసి 4జీ సేవలను పరీక్షించింది. అంతకు ముందు కేరళలో ఇడుక్కి జిల్లాలో 2100 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో 4జీ సేవలు పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే వచ్చే నెలలో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ తన 4జీ సేవలను ప్రారంభించేందుకు అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌లో 2జీ, 3జీ సేవలు కస్టమర్లకు లభిస్తుండగా, 4జీ వస్తే ఆ రెండింటితో కలిపి 4జీ సేవలను వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక 4జీ వాడాలనుకునే బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు తమ సిమ్‌లను 4జీ సిమ్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అందుకు రూ.20 నామమాత్రపు చార్జి అవుతుంది.