రెండున్నరేళ్ల కిందట ‘శ్రీమంతుడు’తో అమెరికాలో వసూళ్ల మోత మోగించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ చిత్రం నాన్-బాహుబలి రికార్డును అలవోకగా బద్దలు కొట్టేసింది. ఏకంగా 2.89 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. అప్పటి నుంచి ఆ రికార్డును దాటడానికి చాలా సినిమాలు ప్రయత్నించాయి. కానీ కుదర్లేదు. ఎట్టకేలకు కొన్ని రోజుల కిందటే ‘రంగస్థలం’ విడుదలై భారీ వసూళ్లు సాధించింది. ఆ చిత్రం విడుదలైన రెండు వారాలకు ‘శ్రీమంతుడు’ను దాటింది. ఇప్పుడా చిత్రం 3.5 మిలియన్ డాలర్లకు చేరువగా ఉంది. ఐతే ‘రంగస్థలం’ రికార్డుపై వెంటనే అటాక్ మొదలైపోయింది. గత వారం విడుదలైన మహేష్ సినిమా ‘భరత్ అనే నేను’ ఆరంభం నుంచి అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది.
ఇప్పటికే మహేష్ బాబు నటించిన మిగతా అన్ని చిత్రాల కన్నా అధిక కలెక్షన్లు వసూలు చేసిన ‘భరత్ అనే నేను’ అమెరికాలో దుమ్ము రేపుతోంది. తాజాగా సినిమా కలెక్షన్లు అమెరికాలో 3 మిలియన్ మార్క్ ను దాటినట్టు నిర్మాత డీవీవీ దానయ్య తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం వెల్లడించారు. అమెరికాలో 3 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన మహేష్ బాబు తొలి సినిమా ఇదే.
గతంలో ఆయన నటించిన ‘శ్రీమంతుడు’ యూఎస్ లో 2.8 మిలియన్ డాలర్లను రాబట్టగా, దాన్ని ‘భరత్ అనే నేను’ అధిగమించింది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం, తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 161.28 కోట్లు రాబట్టిందని, తాను నిజం చెబుతున్నానని నిన్న దానయ్య వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక మూడు వారాల క్రితం విడుదలైన ‘రంగస్థలం’ అమెరికాలో 3.5 మిలియన్ డాలర్లను వసూలు చేయగా, దాన్ని ‘భరత్ అనే నేను’ ఈ వారంలో అధిగమిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
#3MillionBharatAneNenu in USA pic.twitter.com/8LZvQAwd1e
— DVV Entertainment (@DVVMovies) April 29, 2018