తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే పాలకుడైతే పాలన ఏ విధంగా ఉంటుందో అని చెప్పడానికి సంక్షేమ పథకాలనే నిదర్శనమని తెలిపారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. టీఆర్ఎస్ ప్లీనరీలో భాగంగా ఇంటింటికి సంక్షేమం- ప్రతి ముఖంలో సంతోషం తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రసమయి మేనిఫెస్టోలో లేని పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌దే అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ పూలే అని కొనియాడారు.
మానవీయకోణంలో ప్రజలకు మంచి పథకాలను ప్రవేశపెట్టిన మట్టిమనిషి కేసీఆర్ అని కొనియాడారు. సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు ఎలాంటి అవినీతి లేకుండా అందుతున్నాయని తెలిపారు. వెయ్యి రూపాయల పించన్ ఇచ్చే సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు రసమయి. వెయ్యి రూపాయల పింఛన్‌తో వృద్ధులు ఆనందంగా బ్రతుకుతున్నారని…. ప్రతి పేదవాడికి దేవుడిగా కేసీఆర్ మారాడని తెలిపారు.
ఒంటరి మహిళల గురించి ఆలోచించిన ఏకైక సర్కార్ టీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. వెయ్యిరూపాయల భృతితో ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారని తెలిపారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.గౌడన్నల,నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మనసున్న మారాజు కేసీఆర్ అన్నారు. కళ్యాణలక్ష్మీ పథకంతో ప్రతి ఆడబిడ్డకు మేనమామగా కేసీఆర్ మారాడన్నారు.
కేసీఆర్ కిట్‌లతో ఆడబిడ్డలకు ప్రసూతి సాయం అందజేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కిట్ దేశానికే ఆదర్శమన్నారు. ఆడబిడ్డలను కళ్లల్లో పెట్టుకుని కాపాడుకుంటున్న సర్కార్ తెలంగాణ ప్రభుత్వమన్నారు. దళితులకు పెద్దపీట వేశామని మూడెకరాల భూమి పంపిణి చేశామన్నారు. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం,మంచి వసతులు కల్పించామని చెప్పారు. అసమానతలు లేని సమాజం కోసం పాటు పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.రసమయి ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని పార్టీ రాష్ట్రకార్యదర్శి గట్టు రాంచందర్ రావు బలపర్చగా ప్రతినిధులు చప్పట్లతో అమోదం తెలిపారు.