తెలుగుదేశం పార్టీనేత, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(67) ఇక లేరు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాసేపట్లో వివేకానందరెడ్డి భౌతికకాయం నెల్లూరుకు తరలించనున్నారు. రేపు నెల్లూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1950 డిసెంబర్ 25న నెల్లూరులో జన్మించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆనంకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సుబ్బారెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చిన్న కుమారుడు మయూర్ ప్రస్తుతం కార్పొరేటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతి పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు.
ఆనం వివేకానందరెడ్డి మృతితో సింహపురి చిన్నబోయింది. ఆనం వివేకానందరెడ్డి మరణ వార్త తెలుసుకున్న నెల్లూరు ప్రజలు విషాదంలో మునిగిపోయారు. రాజకీయాల్లో విలక్షణ నేతగా గుర్తింపు తెచ్చుకున్న వివేకానందరెడ్డి.. ప్రజల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆనం వివేకానందరెడ్డి ఏ విషయంపై అయినా ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడేవారు. నెల్లూరులో ధర్నా చేయాలన్నా, ప్రతి పక్షాలపై ఎదురుదాడి చేయాలన్నా ఆయన తర్వాతే అనే వారు.
ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తర్వాత జిల్లా రాజకీయాలపై వివేకానందరెడ్డి క్రమంగా పట్టు సాధించారు. వైఎస్సార్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. వైఎస్ స్వయంగా మంత్రి పదవి ఇస్తానని ఆహ్వానించినా వినమ్రంగా తిరస్కరించి తన తమ్ముడు ఆనం రామనారాయణ రెడ్డికి ఇప్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల మధ్య ఉండే వివేకా రోజూ సెకండ్ షో చూసి ఇంటికెళ్లేవారు. ఇక భోజన విషయంలో ఏమాత్రం రోజూ రెండు పూటలా బిర్యానీ ఉండాల్సిందే.
మార్కెట్లోకి కొత్తగా వచ్చే అన్ని స్టైల్స్ అనుకరించేవారు. హెయిర్ స్టైల్‌తో పాటు చరవాణి వినియోగంలోనూ వివేకా తనదైన ముద్ర వేశారు. మార్కెట్లోకి వచ్చే ఏ కంపెనీ కారైనా ముందుగా ఆయన వాడాల్సిందే. రాజకీయాల్లో ఉంటూనే జీవితాన్ని అంత జల్సాగా అనుభవించిన నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. నెల్లూరులోని ప్రతి వీధిలోనూ వివేకాకు అభిమానులున్నారు.