గత కొన్ని రోజులగా తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న అంశం క్యాస్టింగ్ కౌచ్. శ్రీరెడ్డి చేస్తున్న ఈ ఆరోపణలతో టాలీవుడులో పెద్ద దుమారమే చెలరేగింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నటులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై హీరోయిన్ ఆదాశర్మ స్పందించారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదని హీరోయిన్ ఆదాశర్మ తెలిపింది. సెక్సువల్ ఫేవర్ చేయాలా? వద్దా? అనేది పూర్తిగా వ్యక్తిగతమైన అంశమని చెప్పింది. పని కోసం శారీరక సుఖం ఇవ్వడానికి కొందరు వెనుకాడటం లేదని ఆమె స్పష్టం చేసింది. ఇది కేవలం సినిమా రంగానికే పరిమితం కాదని… ఎన్నో చోట్ల ఇది కొనసాగుతోందని చెప్పింది.
కాకపోతే, మహిళలను లైంగికంగా ఒత్తిడి చేయడం మాత్రం తప్పు అని తెలిపింది. తనకు ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని చెప్పింది. బాలీవుడ్ తో పోల్చితే దక్షిణాదిలో సినిమా ఛాన్సులు దక్కించుకోవడం ఈజీ అని ఆదా తెలిపింది. దక్షిణాదిలో ఒక్క సినిమా హిట్ అయితే… అవకాశాలు వాటంతట అవే వస్తుంటాయని చెప్పింది. బాలీవుడ్ లో అవకాశాలు ఎలా వస్తాయో తనకు అర్థం కావడం లేదని తెలిపింది.