సింగరేణి పరిసర ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 2017-18లో 6.2 శాతం వృద్దరేటుతో రికార్డు స్థాయిలో 646 లక్షల టన్నుల బొగ్గును ఉత్తత్పి చేయడం పట్ల సీఎం కేసీఆర్ హర్హం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎండీ శ్రీధర్, కార్మికులను సీఎం అభినందించారు. సింగరేణి థర్మల్ ప్లాంటు రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తుందన్నారు. ఎన్నికలలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన 17 హామీలను అమలు చేయడం కోసం ఉత్తర్వుల జారీ చేశామన్నారు.
సింగరేణి బొగ్గు ద్వారా సమకూరిన డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్టు(డి.ఎం.ఎఫ్.టి), ఇతర సౌకర్యాలతో సమకూరే నిధులను ఉపయోగించి రహదారుల నిర్మాణాలతో, మౌలిక కల్పనకు కృషి చేయాలని సూచించారు. సింగరేణి గనుల ద్వారా ఎంతో విలువైన ఖనిఖ సంపద వస్తుందని అది జాతి నిర్మాణ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. కానీ ఇదే సమయంలో సింగరేణి ప్రాంతాలు ఛిద్రమైపోతున్నాయని, బొగ్గు తరలింపు వల్ల రోడ్లు పూర్తిగా పాడువుతున్నాయన్నారు. అక్కడే ప్రాంతాలే కాకుండా బొగ్గు తరలించే ప్రాంతాల్లో కూడా రోడ్లు బాగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. కావున బొగ్గు గనులున్న ప్రాంతాలు, వాటి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధితో పాటు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం కేసీఆర్ తెలిపారు.
మారుమూల ప్రాంతాల అభివృద్ది కోసమే జిల్లాల పునర్విభజన తీసుకొచ్చామన్నారు. కొత్తగూడెం, భూపాలపల్లి, అసిఫాబాద్, పెద్దపల్లి మంచిర్యాల ప్రాంతాలను కొత్త జిల్లాలుగా చేసుకున్నామని తెలిపారు. ఆయా జిల్లాల కేంద్రాలలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వేగంగా జరగాలని సూచించారు. డి.ఎం.ఎఫ్.టి నిధులు రూ.1500 కోట్లు అందుబాటులో ఉన్నాయని వాటితో పాటు అభివృద్ధి నిధులు, నరేగా నిధులు, ఇరిగేషన్ నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సమకూరే నిధులన్నింటినీ అనుసంధానం చేసి సింగరేణి ప్రాంతాలలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.ఏ ప్రాంత అభివృద్దికి ఆ ప్రాంతం ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కలిసి నిధులు విడుదల చేయాలన్నారు. ఈ పనులను కలెక్టర్లు పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ నల్లాల ఓదేలు, సింగరేణి ఎండీ ఎన్.శ్రీధర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.