ఎన్టీఆర్..త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హీరిక,హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటించే ఈ చిత్రం షూటింగును వచ్చే నెల 12న ప్రారంభించడానికి ముహూర్తాన్ని నిర్ణయించారు.
ఈ సినిమాలో తారక్ మరోసారి కొత్త లుక్‌తో కన్పించబోతున్నారు. ఇప్పటికే సిక్స్ ప్యాక్ వర్కవుట్స్‌తో ఎన్టీఆర్ వ్యాయామం చేస్తున్న వీడియో ఇటీవల వైరలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ని కొత్త గెటప్‌లో చూపించేందుకు చిత్రబృందం ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్‌వెల్ కష్టపడుతున్నారు.
పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలోని నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ‘టెంపర్’లో సిక్స్‌ప్యాక్‌తో, ‘జైలవకుశ’లో త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్న తారక్ ఇప్పుడు ఎలాంటి గెటప్‌లో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.