సీఎం కేసీఆర్.. బీజేపీ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే… ఆ దిశగా సీఎం కేసీఆర్ వేగం పెంచారు. అవసరమైతే తానే నాయకత్వం వహిస్తానన్న కేసీఆర్… ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తొలి అడుగేశారు.. కేసీఆర్‌కు ఫోన్ చేసి అభినందించిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. తామూ మీ వెంటే నడుస్తాని చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు. ఈ రోజు (మార్చి 19) న కేసీఆర్ కోల్‌కతా వెళ్లి మమతతో చర్చలు జరపనున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఈ రోజు భేటీ కానున్నారు. ఫ్రంట్ ఏర్పాటు ప్రకటన అనంతరం కేసీఆర్ చేస్తున్న తొలి పర్యటన ఇది. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అనంతరం సీఎం కేసీఆర్ ఉదయం 11:45 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా చేరుకుంటారు.
సీఎం కేసీఆర్ వెంట టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, ఎంపీ కల్వకుంట్ల కవిత వెళ్తారు. వీరితోపాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ తదితరులు వెళ్తున్నట్టు సమాచారం. మధ్యాహ్నం పశ్చిమబెంగాల్ సచివాలయంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా, ఇతర విషయాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నట్టుగా సమాచారం.
మధ్యాహ్నం 3:15 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సమావేశం ఉంటుంది. భేటీ అనంతరం 6:15 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి ప్రసిద్ధ కాళీమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొంటారు. రాత్రి 7:40 గంటలకు కోల్‌కతా నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.