రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ప్రశ్న అడిగారు. అవునండీ ఇది నిజం.
ఇది ఎక్కడో కాదు పశ్చిమ బెంగాల్లో గురువారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షలో విద్యార్థులకు ఈ ప్రశ్న ఎదురైంది. అందులో విరాట్ కోహ్లీ గురించి రాయమని ఓ ప్రశ్న కనిపించింది.
ఇంకేముందీ..విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. రికార్డులు బద్దలు కొడుతూ యూత్ ఐకాన్ గా మారిన కోహ్లీ గురించి రాయమంటే..ఎవరికి మాత్రం తెలియకుండా ఉంటుంది చెప్పండి.
కోహ్లీ ప్రశ్నకి విద్యార్థులు చకచకా జవాబు రాసేసి తెగ సంబరపడిపోయారు. పరీక్ష అనంతరం ఆ ఆనందాన్ని కొందరు విద్యార్థులు విలేఖరులతో పంచుకున్నారు. అసలు ఇలాంటి ప్రశ్న వస్తుందని ఊహించలేదని, కోహ్లీ గురించి వచ్చిన ఆ ప్రశ్నకు ఆనందంతో సమాధానం రాసినట్టు ముర్షిదాబాద్‌లోని నబీపూర్ సరళబాల హై స్కూల్ విద్యార్థిని షమీం అఖ్తర్ చెప్పుకొచ్చింది.
ఇలా మిగతా విద్యార్థులు కూడా కోహ్లీ గురించి వచ్చిన ప్రశ్నపై ఆనందంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.