గిన్నిస్ బుక్‌లోకి ‘మహా బతుకమ్మ’

280
- Advertisement -

తెలంగాణ ప్రకృతి పూల పండగ…సాంస్కృతిక వేడుక బతుకమ్మ గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించింది.విశ్వవేదిక మీద సగర్వంగా తలెత్తుకుంది. యావత్ ప్రపంచమే నివ్వేరపోయేలా చేసింది. కేరళ రాష్ట్రంలో ఒకేరోజున 5,211 మంది మహిళలు ఓనమ్ పండుగను జరుపుకోవడం ఇప్పటివరకు ప్రపంచ రికార్డుగా ఉన్నది. ఓనం రికార్డును బతుకమ్మ మహాప్రదర్శన అధిగమించింది. ఒకేచోట అధికసంఖ్యలో 9,292 మంది మహిళలు బతుకమ్మ ఆడి ఓనం రికార్డును అధిగమించారు. బతుకమ్మ గిన్నిస్ రికార్డు సాధించటం గర్వకారణంగా ఉందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ ఘనత సాధించడానికి తోడ్పడ్డ ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గిన్నిస్ రికార్డు ప్రకటనతో మహిళలు ఉద్వేగంతో చప్పట్లు కొట్టారు.

Maha-Bathukamma

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళల బతుకమ్మ పాటలతో, ఆటలతో స్టేడియం మార్మోగిపోయింది. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఉయ్యాలో ఉయ్యాలో.. అంటూ మహిళలు పాటలు పాడుతూ సందడి చేశారు. కోలాట ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.తంగేడు, గునుగు, బంతిపూలతో పేర్చిన బతుకమ్మలతో స్టేడియం సరికొత్త శోభను సంతరించుకుంది. చూడముచ్చటగా బతుకమ్మలను పేర్చిన ఆడపడుచులు సందర్భానుసారంగా పాటలు పాడుతూ సందడి చేశారు.

స్టేడియం మధ్యలో 20 అడుగుల ఎత్తులో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మ చుట్టూ 35 గుండ్రటి వరుసలలో మహిళలు ఆడుతున్నారు. మొదటి వరుసలో 200 మంది ఉంటే.. చివరివరుసలో వేయిమంది మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ప్రతీవరుసలో బతుకు కష్టసుఖాల విలక్షణతను వివరించే శృతిలయల ఆటపాటలతో లాల్‌బహదూర్ స్టేడియం మార్మోగిపోయింది.

bathukamma

- Advertisement -