తన పుట్టుకచావు టీఆర్ఎస్తోనేనని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడిన హరీష్ తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సీఎం కేసీఆర్ అడుగులో అడుగై నడుస్తానని..సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు చెప్పారు.
ఉనికి కోసమే కాంగ్రెస్ నేతలు బస్సుయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు హరీష్. ప్రజల విశ్వసనీయతను కాంగ్రెస్ నాయకులు కొల్పోయారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఫ్లోరైడ్ సమస్య పట్టిపీడించందన్న హరీష్…మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యను తరిమికొట్టామన్నారు. మంచి నీళ్ల కోసం గతంలో ధర్నాలు చేస్తే..మేం ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నమని హరీశ్‌రావు అన్నారు.
నాడు కరెంట్ లేక ప్రజలు,రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్న హరీష్..నేడు 24 గంటల కరెంట్‌ను రైతులకు అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ 4 కిలోల బియ్యం ఇస్తే..మేం సీలింగ్ లేకుండా మనిషికి 6 కిలోలు ఇచ్చినమని తెలిపారు. కాంగ్రెస్ చరిత్ర ఉద్యమంలో వెనుకడుగే..రాజీనామాలో వెనుకడుగేనని విమర్శించారు.