అభివృద్ధా?..గూండాయిజమా?:ప్రకాష్‌ రాజ్

194
- Advertisement -

సినీ నటుడు ప్రకాష్ రాజ్…బీజేపీపై మరోసారి మండిపడ్డారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రకాష్‌..బీజేపీ నేతలను తూర్పారబట్టారు. హింసామార్గంలో వెళితే మరింత హింసను చూడాల్సి వుంటుందని, మీ ఎన్నికల మ్యానిఫెస్టో గూండాయిజాన్ని పెంచి పోషించడమా? లేక అభివృద్ధా? అంటూ నిప్పులు చెరిగారు.

తొలుత లెనిన్ విగ్రహాన్ని, ఆపై పెరియార్ విగ్రహాన్ని, తరువాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వసం చేశారని గుర్తు చేసిన ఆయన, మీ ఎజెండా ఏమిటని ప్రశ్నించారు. మన చిన్నారులకు మీరు ఏం చెప్పదలచుకున్నారని అడిగిన ఆయన, దయచేసి ఈ విగ్రహాల రాజకీయాన్ని ఆపాలని చేతులెత్తి కోరుతున్నానని అన్నారు. గత కొంతకాలంగా #justasking అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ వేదికగా బీజేపీ,ఆర్‌ఎస్సెస్‌ నేతలు,కార్యకర్తలు చేస్తున్న అఘాయిత్యాలను ఆయన ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.

prakash raj

ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. గత 25 ఏళ్లుగా త్రిపురను పాలిస్తున్న లెఫ్ట్ కోటను బద్దలు కొడుతూ బీజేపీ అధికారంలోకి రాగా ఫలితాలు వెల్లడైన కొన్ని గంటల్లోనే బీజేపీ, లెఫ్ట్ మద్దతుదారులు ఘర్షణకు దిగారు. ఆ అల్లర్ల కారణంగా దక్షిణ త్రిపురలోని బెలోనియా పట్టణంలో ఉన్న మార్కిస్టు నేత లెనిన్ విగ్రహం ధ్వంసం అయ్యింది. ఈ నేపథ్యంలోనే ప్రకాష్‌ మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

- Advertisement -