కొత్త టెక్నాలజీ వైపు దృష్టిసారించే వారికి భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటాయన్నారు మంత్రి కేటీఆర్. వరంగల్ అర్బన్ జిల్లాలోని హసన్ పర్తి మండలం అనంతసాగర్‌లో ఎస్‌ఆర్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించిన కేటీఆర్ అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. ఇంక్యుబేషన్ సెంటర్ కోసం కృషిచేసిన ఎస్‌ఆర్ విద్యాసంస్థల ఛైర్మన్ వరదారెడ్డిని అభినందించారు .
వరంగల్‌లో ఉండే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు యువతరానికి ఇదో మంచి అవకాశం అన్నారు. ఏ సాంకేతిక పరిజ్ఞానమైన ప్రజలకు ఉపయోగపడకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదని సీఎం కేసీఆర్ ఎప్పుడు చెబుతుంటారన్నారు. నవీన ఆవిష్కరణలు కేవలం చదువుకున్న వారికే పరిమితం కావన్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన చింతకింది మల్లేషం తయారు చేసిన లక్ష్మీ ఆసు యంత్రం నేత కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇవాళ 10వేలకు పైగా ఆసుయంత్రాలను నేతన్నలకు అందించారని గుర్తుచేశారు.
2014కు ముందుకు విద్యా,అభివృద్ధిపై గత పాలకులు దృష్టిసారించలేదన్నారు. కొత్త ఉద్యోగాలు స్టార్టప్‌ల నుంచే వస్తాయన్నారు. రాష్ట్రంలో రెండు వేలకు పైగా స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు. ఎస్‌ఆర్ ఇన్నోవేషన్‌లో కొత్త ఆలోచనలతో వచ్చిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందన్నారు. డ్రోన్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు.
పాత తరం ఆలోచనలను దూరం పెట్టి కొత్త ఆలోచనలతో నూతన స్టార్టప్‌లతో ఉద్యోగాలు సృష్టించే వారిలా తయారు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్‌ని హైదరాబాద్‌కు ధీటుగా ఐటీ హబ్‌గా తయారుచేస్తామని తెలిపారు కేటీఆర్. టెక్ మహీంద్ర త్వరలోనే వరంగల్‌కు రాబోతుందన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు టాస్క్ సెంటర్‌ని ఏర్పాటుచేశామన్నారు.