2019 సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడతున్న కొద్ది బీజేపీ తన బలాన్ని పెంచుకుంటు పోతోంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు,మూడు రాష్ట్రాలు మినహా ఎన్నికలు జరిగిన ప్రతిచోట బీజేపీ విజయ దుందుభీ మోగిస్తోంది. తాజాగా మూడు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. త్రిపురలో పాతికేళ్ల కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొడుతు అధికారంలోకి రాగా నాగాలాండ్‌లో సైతం బీజేపీ కూటమి గెలుపుతీరాలకు చేరింది. ఇక మేఘాలయలో హంగ్ ఏర్పడగా కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ,దాని మిత్రపక్షాలు తాజాగా మరో రెండు స్ధానాలను తమ ఖాతాలో వేసుకున్నాయి. దేశంలో మొత్తం 29 రాష్ట్రాల్లో 19 బీజేపీ పాలనలో ఉండగా హస్తం పార్టీ చేతిలో 3 మాత్రమే మిగిలాయి. కర్నాటక, పంజాబ్, మిజోరామ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా మేఘాలయాలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారం ఏర్పాటుచేస్తే 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉండనుంది.
1993లో మొత్తం 26 రాష్ట్రాల్లో 15 కాంగ్రెస్ చేతుల్లోనే ఉండేవి. కానీ ప్రస్తుతం 19 రాష్ట్రాల్లో బీజేపీ దాని భాగస్వామ్య పక్షాలు అధికారంలోకి వచ్చి ఆ రికార్డును చేరిపేసింది.2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ కేవలం ఐదు రాష్ట్రాల్లో (గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, నాగాలాండ్)నే అధికారంలో ఉండేది. 2014 ఎన్నికలతోపాటే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ ఇటు ఆంధ్రప్రదేశ్‌లో, సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ అటు సిక్కింలో అధికారంలోకి వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో శివసేన సాయంతో అధికారంలోకి రాగా.. అదే సమయంలో హర్యానాలోనూ పాగా వేసింది. తర్వాత జార్ఖండ్ పాగా వేసిన బీజేపీ జమ్ముకశ్మీర్ లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అక్కడి పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.
2015లో బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో ఓటమే మోడీకి మింగుడు పడలేదు. అయితే బీహార్‌లో ఆర్జేడీతో కలిసి జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్లలోనే నితీశ్ కుమార్ మళ్లీ బీజేపీవైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే. 2015లో అస్సాంలో ఘనవిజయం సాధించగా అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 47 మంది ఎమ్మెల్యేలూ బీజేపీలో చేరి కాషాయ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.
తర్వాత యూపీతోపాటు ఉత్తరాఖండ్‌లోనూ బంపర్ మెజార్టీతో గెలిచింది. గోవా, మణిపూర్‌లలో కాంగ్రెస్ కన్నా తక్కువ స్థానాల్లో గెలిచినా.. స్థానిక పార్టీల మద్దతు కూడగట్టి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. త్వరలో జరగనున్న కర్ణాటక,మిజోరంలలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి. కేరళలో సీపీఎం, తెలంగాణలో టీఆర్ఎస్,తమిళనాడు అన్నాడీఎంకే, బెంగాల్‌లో తృణమూల్,ఢిల్లీలో ఆప్,ఒడిశాలో నవీన్ పట్నాయక్ అధికారంలో ఉన్నారు.