ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కమలం సత్తాచాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ప్రజలు బీజేపీకి స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టారు. త్రిపురలో బీజేపీ హిస్టరీ క్రియేట్ చేసింది… పాతికేళ్ల కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టింది. నిజాయితీపరుడైన ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్‌కు ఉన్న పేరు సీపీఎంను ఓటమి నుంచి కాపాడలేకపోయింది.
ఫలితాల సరళి మొదలైనప్పుడు బీజేపీ కాస్త లీడ్‌లో ఉన్నట్టు కనిపించినా… వెంటనే కమ్యూనిస్టులు మళ్లీ ఆధిక్యంలోకి వచ్చేశారు. అయితే చివర్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ధన్‌పూర్ నుంచి త్రిపుర సీఎం మాణిక్‌సర్కార్ ఆధిక్యంలో ఉన్నారు. వారణాసిలో మోడీ ఎన్నికల మేనేజర్‌గా పనిచేసిన సునీల్ దియోదర్… మూడేళ్లుగా త్రిపురలోనే మకాం వేసి రచించిన వ్యూహాలకు కమలం వికసించింది. గత ఎన్నికల్లో 10 స్థానాలను గెలుచుకున్న హస్తం… ఈ సారి ఖాతా కూడా తెరవలేదు.
ఇక నాగాలాండ్‌లో కూడా బీజేపీ కూటిమి అధికార పార్టీని వెనక్కి నెట్టింది. మేఘాలయాలో హంగ్ ఏర్పడగా కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ పీడీపీ మద్దతు కీలకం కానుంది. ఇక 2009 ఎన్నికల్లో దశాబ్దాలుగా బెంగాల్‌ను పాలిస్తూ వచ్చిన సీపీఎంకు షాక్ ఇస్తూ ప్రజలు తృణమూల్‌కు పట్టం కట్టారు. తాజాగా పాతికేళ్లుగా పాలన సాగిస్తున్న త్రిపురను సైతం సీపీఎం కొల్పోవడంతో ఒక్క కేరళలో మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంది.