కనీవినీ ఎరుగని రీతిలో రూ.వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన తొలి సినిమాగా జక్కన్న బాహుబలి-2 చరిత్ర లిఖించింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టించింది బాహుబలి-2.ఆ సినిమాలో శివగామిదేవి పాత్రకు తొలుత శ్రీదేవిని సంప్రదించామని, అయితే ఆమె మాత్రం భారీ డిమాండ్లు పెట్టడంతో చివరకు రమ్యకృష్ణను ఆ పాత్ర కోసం తీసుకున్నామని రాజమౌళి ఓ సందర్భంలో తెలిపారు.
దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన శ్రీదేవి.. రాజమౌళి తీరును తప్పుబట్టారు. అనంతరం దీనిపై రాజమౌళి స్పందించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లిన జక్కన్న.. అక్కడి మీడియాతో మాట్లాడారు. శ్రీదేవి గురించి ప్రశ్నించగా.. రాజమౌళి ఆ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు. శివగామి దేవి పాత్రకు శ్రీదేవి నో చెప్పిన విషయాన్ని, ఆమె డిమాండ్లను వెల్లడించి ఉండాల్సిందికాదని జక్కన్న అన్నారు.
ఎవరు కరెక్ట్ అనేది ప్రజలే నిర్ణయిస్తారు. అయితే ఒక్క విషయం.. ఆనాడు ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి మాట్లాడకపోయి ఉండి ఉంటే బాగుండేది. అదే నేను చేసిన పొరపాటు. దానికి నేను చింతిస్తున్నాను’’ అని రాజమౌళి పేర్కొన్నారు. అంతేకాకుండా ముంబైలో ఉంటూ దక్షిణాది సినీ ఇండస్ట్రీకి పెద్దగా నిలిచిన శ్రీదేవి అంటే తనకు చాలా గౌరవముందని అన్నారు.