ఆమె ఒక నటనాతరంగం .. అభిమానుల గుండెల్లో వెల్లువగోదావరిలా ఉప్పొంగింది.ప్రాంతాలకు అతీతంగా అభిమానులను సంపాదించుకుంది. పుట్టింది తమిళనాడులో అయిన తన నటనతో ఎక్కడికి వెళ్లిన తమ ఇంట్లో మనిషే భావన కలిగించింది. అర్ధశతాబ్దం పాటు భారతీయ సినీ పరిశ్రమను ఏలిన శ్రీదేవి ఇక లేరన్న వార్తను యావత్ భారతం జీర్ణించుకోలేకపోతోంది.
ఇక టాలీవుడ్‌తో శ్రీదేవికి విడదీయరాని సంబంధం ఉంది. దాదాపుగా తెలుగు సినీపరిశ్రమలో శ్రీదేవి అందరు అగ్రహీరోలతో జోడీగా నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్‌బాబు,చిరంజీవి, వెంకటేశ్, నాగార్జునతో పలు చిత్రాల్లో నటించిన శ్రీదేవి తెలుగుతెరపై వెన్నెలమ్మ, వెల్లువగోదావరిలా నిలిచిపోయింది. పదహారెళ్లవయసు చిత్రంలో శ్రీదేవిని చూసి గుండెజారని కుర్రకారు అప్పట్లో లేదంటే అతిశేయొక్తికాదు. తన అందం, అంతకు మించిన సహజ, చిలిపినటతో కోట్లాదిమంది అభిమానుల మనసుల్లోనిలిచిపోయింది. నాలుగు తరాల స్టార్ హీరోలందరితోనూ నటించిన హీరోయిన్గా రికార్డు సృష్టించింది.
బాలనటిగా తెలుగులో బడిపంతులు చిత్రంలో ఎన్టీఆర్ మనుమరాలిగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత కాలంలో అదే ఎన్టీఆర్ సరసన 16 ఏళ్ల వయసులో వేటగాడు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో వేటగాడు, సర్దార్ పాపారాయుడు, గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, అనురాగదేవత వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో శ్రీదేవి నటించింది.
ఎన్టీఆర్‌తో పాటూ ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలతో సినిమాల్లో చేశారు. వారి సినిమాల్లో మనవరాలిగా, కూతురిగా నటించిన శ్రీదేవి.. అదే హీరోల సరసన కథానాయికగానూ నటించి మెప్పించారు. ఏఎన్నార్-శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ప్రేమాభిషేకం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
కృష్ణ-శ్రీదేవి కాంబినేషన్లో వజ్రాయుధం , కృష్ణంరాజు-శ్రీదేవి కాంబినేషన్లో రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన త్రిశూలం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అందాల నటుడు శోభన్‌బాబుకి కూతురిగా చేసిన శ్రీదేవి తర్వాత బంగారు చెల్లెలు, మోసగాడు, ఇల్లాలు, కృష్ణార్జునులు, దేవత, కోడెత్రాసు సినిమాల్లో హీరోయిన్గా నటించింది.ఇందులో రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన దేవత సినిమాలో శ్రీదేవి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. టాలీవుడ్లో తొలి తరంతో పాటు… తర్వాత తరం చిరంజీవి,నాగార్జున,వెంకటేష్ వంటి హీరోలతో నటించింది శ్రీదేవి.