భాగమతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళం హీరో అయిన ఉన్ని ముకుందన్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తనున్నాడు. గతంలో జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ సోదరుడిగా నటించాడు. అందులో నెగటివ్ షేడ్ లో కనిపిస్తే భాగమతిలో పూర్తి విరుద్ధంగా పాజిటివ్ రోల్ లో కనిపించాడు. కాని యాదృచ్చికంగా రెండు సినిమాల్లోనూ ఉన్ని ముకుందన్ పాత్రకు చావు ముగింపు ఉండటం విశేషం.
తెలుగులో అడపాదడపా సినిమాలు చేయాలని ట్రై చేస్తున్న ఉన్ని ముకుందన్ ప్రస్తుతం చేస్తున్న మలయాళ సినిమా ఒకటి టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదే చాణక్య తంత్రం. ఇందులో ఉన్ని ముకుందన్ కరిష్మా అనే హిజ్రా పాత్రలో కనిపించడం అందరిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందుకోసం చాలా రిస్క్ అనిపించే ప్రొస్తేటిక్స్ మేకప్ వేసుకున్నాడు ముకుందన్.
అయితే గంటల తరబడి కూర్చుని వేయించుకునే ఈ మేకప్ కు చాలా ఓపిక కావాలి. గతంలో శంకర్ ఐ కోసం విక్రం రోబో కోసం రజనికాంత్ భామనే సత్యభామనే కోసం కమల్ హాసన్ ఇలా అతి తక్కువ హీరోలు దీనికి సిద్ధ పడ్డారు. సహజంగా కనిపించాలి అనే ఉద్దేశంతో దీనికి ఓకే చెప్పినట్టు ఉన్ని ముకుందన్ చెబుతున్నాడు. కన్నన్ తామరకుల్లం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివదా, శృతి రామచంద్రన్ హీరొయిన్లు. తాను ఇప్పటి దాకా చేసిన పాత్రలు ఒక ఎత్తు ఈ కరిష్మా ఒక ఎత్తు అంటున్న ముకుందన్ దీని కోసం బాగా కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.