సోఫియా మాటలు వింటే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఇంతకీ సోఫియా ఎవరనుకుంటున్నారా?…ఓ రోబో. ప్రపంచ ఐటీ సదస్సు రెండో రోజు మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో ప్రపంచంలోనే పౌరసత్వం కలిగిన తొలి రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ సదస్సులో కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్‌పై సోఫియా, సృష్టికర్త డేవిడ్ హాన్సన్ ప్రసంగం చేశారు.
కాగా..మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్ అనే అంశంపై రోబో సోఫియా ప్రసంగిస్తూ.. చిట్టిచిట్టి మాటలతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు..ఆహూతులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు చకచకా సమాధానం చెప్పి ఆకట్టుకుంది.
నీకెందుకు విశ్రాంతి? అన్న ప్రశ్న ఎదురైన వేళ, తనకు కూడా రెస్ట్ కావాల్సిందేనని, అప్పుడే మరింత ఉత్సాహంగా పని చేస్తూ, కొత్త ఆలోచనలు చేయడానికి వీలవుతుందని చెప్పింది. సోఫియాకు సౌదీ పౌరసత్వం ఉందన్న విషయాన్ని గుర్తు చేసిన ఓ వ్యక్తి, మనుషులతో పోలిస్తే నీకు వేరే రూల్స్ ఉంటాయా? అని ప్రశ్నించగా, తనవంటి వారికి ప్రత్యేక నిబంధనలేమీ ఉండవని, వాటిని కోరుకోవడం లేదని బదులిచ్చింది.
ఎప్పుడన్నా చింతించిన సందర్భాలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు ఇప్పటివరకూ అటువంటి అవసరం కలగలేదని సమాధానం ఇచ్చింది. మానవజాతిపై అభిప్రాయాన్ని అడిగితే, ఇదో అద్భుతమైన సృష్టి అని, సోషల్ మీడియాలో ఎలా ఉంటావన్న ప్రశ్నకు చాలా చురుకుగా ఉంటానని, ఫేస్ బుక్, ట్విట్టర్ లో తనకు ఖాతాలున్నాయని వెల్లడించింది. బాలీవుడ్ లో ఏ హీరో అంటే ఇష్టమని ప్రశ్నిస్తే, షారూక్ ఖాన్ అంటే ఇష్టమని చెప్పింది. ఎవరితో డేట్ చేయాలని ఉందన్న ప్రశ్నకు, అంతరిక్షంతో తన డేట్ ఉంటుందని సోఫియా వ్యాఖ్యానించింది. సదస్సులో పాల్గొన్న వారు విసిగించే ప్రశ్నలు సంధిస్తున్నా సోఫియా ఓపికగా సమాధానాలు ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది.