తమిళనాట రాజకీయ అస్థిరత ఏర్పడ్డ సమయంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విశ్వనటుడు కమల్ హాసన్ లు తమ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వడంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆ ఇద్దరూ కలిసి పనిచేస్తారా అన్న విషయంపై ఇప్పటివరకు ఎవరూ స్పష్టతనివ్వలేదు. ఈ నేపథ్యంలో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించిన విశ్వనటుడు కమల్ హాసన్ తమిళ రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ రజనీకాంత్ పార్టీలో `కాషాయ` రంగు ఉంటే ఆయనతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని కమల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఇండియా కాన్ఫరెన్స్ -2018 పేరుతో ఏర్పాటు విద్యార్థులు ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ లో తమిళనాట నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కమల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే తాజాగా కమల్‌హాసన్ తన అభిమానులకు నిరాశను మిగులుస్తూ సంచలన విషయం వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటికే ప్రకటించిన కమల్.. ఇకపై సినిమాలు చేయనని తేల్చిచెప్పారు. ప్రస్తుతం బోస్టన్‌లో ఉన్న కమల్.. అక్కడ ఓ ప్రైవేట్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. అయితే ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు సినిమాలు మాత్రం యథావిధిగా ప్రేక్షకుల ముందుకు వస్తాయని తెలిపారు.
ఈ నెలలోనే తన పార్టీ పేరును, విధివిధానాలను వెల్లడిస్తానని తెలిపారు. ‘‘త్వరలో రాబోతున్న రెండు సినిమాల తర్వాత నేను సినిమాలు చేయను. నేను నటుడిగా చనిపోవడానికి ఇష్టపడడం లేదు. ప్రజాసేవ చేసిన తర్వాతే తుది శ్వాస విడుస్తా. అందుకే పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. ప్రజలు నిజాయితీగా బతికేందుకు ఎదో ఒకటి చేయాలని భావిస్తున్నాను. 37 ఏళ్లుగా నేను ప్రజా జీవితంలో ఉన్నాను. ఈ 37 సంవత్సరాలలో దాదాపు పది లక్షల మంది నిజాయితీపరులైన పనిమంతులను కలుసుకున్నాను. గత 37 ఏళ్లుగా వారు నాతోనే ఉన్నారు. బ్యాంక్‌లో నా అకౌంట్లు డబ్బులు వేసుకోవడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాల్లోకి రావాలని పదేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నా’’ అని కమల్ తెలిపారు.