తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని కీర్తిని సంపాదించుకున్న మహనీయ నటుడు నందమూరి తారక రామారావు. కళా ప్రపంచంలో ఉన్న అన్ని కోణాలను ఆయన హావభావాలతో ప్రతి సినిమాలో చూపించారు. ముఖ్యంగా చారిత్రాత్మక పౌరాణిక చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. తనదైన శైలి నటనతో రాముడు – కృష్ణుడు అంటే అలానే ఉంటారేమో అనేలా ఒక భావనను కలిపించిన మహనీయుడు.
హీరో అయినా విలన్ అయినా నటనలో ఆ రాజసం కనిపించి తీరాల్సిందే. మరి అలాంటి నట సార్వభౌముని జీవిత చరిత్రను తెరపై రెండు గంటల్లో చూపించాలంటే చాలా కష్టంతో కూడుకున్నపని. అలాగే ఆయన జీవితంలో ఉన్న ఎన్నో కీలక సినిమాల పాత్రలను తెరపై చూపించడం మరొక పెద్ద ప్రయోగం. అలాంటి ప్రయోగాన్ని ఇప్పుడు ఆయన తనయుడు బాలకృష్ణ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అనే ఆ సినిమాలో మొత్తంగా బాలయ్య 62 గెటప్పుల్లో కనిపించబోతున్నాడు.
ఎన్టీఆర్ వెండి తెరపై పోషించిన పాత్రలన్నింటినీ బాలయ్య ఇప్పుడు మళ్లీ చేసి చూపిస్తారన్నమాట. అందుకోసం తగిన కసరత్తులు మొదలయ్యాయి. బాలీవుడ్ నుంచి ఓ టీమ్ ఇప్పుడు రంగంలోకి దిగింది. బాలయ్య కోసం కొన్ని స్కెచ్చులు తయారు చేస్తున్నారు. ఆయన కేశాలంకరణ ఎలా ఉండాలో, మీస కట్టు ఎలా ఉండాలో… బొమ్మలు వేసి చూపిస్తున్నారు. ఈ కసరత్తు పూర్తయిన తరవాత ఆయా గెటప్పులకు సంబంధించిన కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. వారాహి చలన చిత్రం సంస్థ రూపొందిస్తున్న ఈ సినిమా మార్చిలో సెట్స్‌పైకి వెళ్తుంది.