అతిగొప్ప పాలనా సంస్కరణగా పరిగణించబడే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రజలకు మేలైన సేవలు అందించడమే లక్ష్యంగా పరిపాలనా విభాగాలు ఉండాలన్నారు సీఎం కేసీఆర్. ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహితమైన పాలన అందాలని అధికారులను ఆదేశించారు.నగరంలోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో మంత్రులు, అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఆవిర్భావ ఏర్పాట్లు, పాలనా అంశాలపై చర్చించారు. ప్రతీ జిల్లాలో ఒకే విధమైన పరిపాలనా విభాగం, ఉద్యోగుల సంఖ్య ఉండాలనే కచ్చితమైన నిబంధన లేదని స్పష్టం చేశారు. ఆయా జిల్లాల్లోని స్వభావం, స్వరూపం, పనితీరు, అవసరాన్ని బట్టి విభాగాల విస్తరణ, కుదింపు, సర్దుబాటు ఉండాలని సూచించారు.
ఎక్కువ జిల్లాలున్న రాష్ర్టాలలో పరిపాలనా విభాగాలు ఎలా ఉండాలనే విషయాలను అధ్యయనం చేయడానికి సీనియర్ ఐఏఎస్ అధికారులు వెళ్లాలని ఆదేశించారు. ఉత్తరప్రదేశ్‌కు ఎస్‌కే జోషి, మధ్యప్రదేశ్‌కు సోమేశ్‌కుమార్, ఛత్తీస్‌గఢ్‌కు మీనా, హర్యానాకు నవీన్ మిట్టల్, ఒడిశాకు బీపీ ఆచార్య, తమిళనాడుకు అజయ్ మిశ్రా, బీహార్‌కు ఎస్‌పీ సింగ్ వెళ్లి అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.
ఒకే స్వభావం కలిగిన పనులు చేసే అధికారులు వేర్వేరు విభాగాల కింద ఉంటే సమన్వయం లోపిస్తుందని అన్న సీఎం.. శాఖల పునరేకీకరణ జరగాలని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, వైద్యం, ఆరోగ్యం, విద్య, పంచాయతీరాజ్ వంటి శాఖలకు ప్రతీ జిల్లాలో పని ఉంటుందని పేర్కొన్నారు. అటవీ శాఖ, మున్సిపల్, మైనార్టీ, ఎస్టీ సంక్షేమం, హార్టికల్చర్, పరిశ్రమల వంటి శాఖల్లో అన్ని జిల్లాల్లో ఒకే విధంగా పని భారం ఉండదన్నారు. జిల్లాల్లో పని భారాన్ని బట్టి ఆయా శాఖలను విస్తరించడం, సర్దుబాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమల శాఖకు పని ఎక్కువ ఉంటుంది.. అక్కడ పరిశ్రమల శాఖ విస్తరించాలని చెప్పారు.
కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఇంకా అవినీతి ఉందన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. అక్కడ సంస్కరణలు రావాలన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ బాగా మారాలని చెప్పారు. రెవెన్యూ శాఖలో సిటిజన్ చార్టర్ అమలు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఆయా శాఖల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించాలని సూచనలు చేశారు.మిషన్ కాకతీయతో చెరువులు బాగుపడ్డాయి.. మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఏర్పడే జిల్లాల్లో మున్సిపాలిటీల సంఖ్య ఆధారంగానే మున్సిపల్ శాఖ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ విస్తరించాలని ఆదేశించారు.