తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెండ్ రూం ఇండ్ల పథకానికి సామాజిక బాధ్యతగా ఉక్కు కంపనీ యజమానులు తమ వంతు సహాయం చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా నిరుపేదలకు నాణ్యతతో కూడిన విశాలమైన రెండు పడక గదులను నిర్మిస్తుందని, ఇంతటి మహత్తర కార్యక్రమానికి సామాజిక బాధ్యతగా సిమెంట్ కంపెనీలు తోడ్పాటునందించాలన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి సోమవారం సచివాలయంలో ఉక్కు కంపనీల యాజమాన్యాలతో సమావేశమయ్యారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సిమెంట్ కంపనీలు మార్కెట్ లో హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా బస్తా సిమెంట్ ను రూ.230కే విక్రయిస్తున్నారని, ఉక్కు కంపనీ యాజయాన్యాలు కూడా తక్కువ రేట్ కు ఉక్కును విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం 2.60 లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో (లక్ష ఇండ్లకు) 1.45 లక్షల మెట్రిక్ టన్నులు, పట్ణణ ప్రాంతాల్లో (60 వేల ఇండ్లకు) 1.04 లక్షల మెట్రిక్ టన్నులు, జీహెచ్ఎంసీ పరిధిలో ( లక్ష ఇండ్లకు) 2.78 లక్షల మెట్రిక్ టన్నులు (మొత్తం 5.27 లక్షల మెట్రిక్ టన్నులు) ఉక్కు అవసరం ఉందని కంపనీ యాజమాన్యాలకు మంత్రులు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తుందని, ఉక్కు విక్రయించిన కంపనీలకు ఎలాంటి జాప్యం లేకుండా ఆన్ లైన్ లో బిల్లుల చెల్లింపులు ఉంటాయని వారికి స్పష్టం చేశారు. లాభపేక్షతో కాకుండా సానుకూల దృక్పధంతో రీజనబుల్ రేట్ కు ఉక్కును విక్రయించాలన్నారు. దీనిపై అన్ని ఉక్కు కంపనీల యాజమాన్యాలతో చర్చించి ప్రభుత్వానికి తమ నిర్ణయం వెల్లడిస్తామని ఉక్కు కంపనీల యాజమాన్యాలు తెలిపాయి. ఈ విషయంపై అధికారులతో మరోసారి భేటీ కావాలని మంత్రులు స్టీల్ కంపనీల యాజమాన్యాలకు తెలిపారు. ఉక్కు కంపనీల యాజమాన్యాలతో రెండు మూడు రోజుల్లో మరోసారి సమావేశమై నిర్ధిష్టమైన ధరను (బేస్ రేట్) నిర్ణయించాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కేటీఆర్ గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ ను ఆదేశించారు.
ఈ సమావేశంలో హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి,గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరెక్టర్ డా.టి.కె. శ్రీదేవి, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ భారతీ, గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజనీర్ సత్యమూర్తి,, జీహెచ్ఎంసీ సీఈ సురేష్ కుమార్, ఆల్ ఇండియా స్టీల్ అసోసియేషన్ చైర్మన్ సురేష్ కుమార్ సింఘాల్, విశాఖ స్టీల్ ప్లాంట్, జిందాల్ ,శాలినీ స్టీల్ కంపనీతో పాటు ఇతర 8 స్టీల్ కంపనీల యాజమానులు పాల్గోన్నారు.