ఆసియాలోనే అతి పెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ముగిసింది. కోరిన కోర్కెలు తీర్చే సమ్మక్క- సారలమ్మల వనప్రవేశంతో జాతర సంపూర్ణమైంది. శనివారం (ఫిబ్రవరి-3) గద్దెలపై ఉన్న సమ్మక్కను చిలకగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పూనుగొండకు, గోవిందరాజును కొండాయికి పూజారులు తీసుకెళ్లారు.
రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండగకు ఈ ఏడాది కోటీ 25 లక్షల మంది భక్తులు వచ్చారని అధికారులు వెల్లడించారు. చివరి రోజైన శనివారం సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముఖ్యంగా వనప్రవేశ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మలు వనప్రవేశం చేస్తుంటే కొందరు కంటతడి పెట్టడం కనిపించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ తదితరులు వనదేవతలను దర్శించుకున్నవారిలో ఉన్నారు.
మేడారం జాతరను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిరంతరం పర్యవేక్షించారు. ప్రభుత్వం రూ.80.55కోట్లతో జాతర ఏర్పాట్లను చేసింది. వచ్చే జాతర సమయానికి మేడారంలో శాశ్వత ఏర్పాట్లు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయిస్తామని హమీ ఇచ్చారు.
ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని..వీఐపీలు వచ్చినా క్యూ లైన్లు ఆపకుండా దర్శనం కల్పించామన్నారు. ఈ జాతరలో ఏర్పాటు చేసిన మ్యూజియం అందరినీ ఆకట్టుకుందన్నారు. జాతర విజయవంతం చేసేందుకు కృషిచేసిన ప్రతొక్కరికి కృతజ్ఞతలు చెప్పారు పోలీసు అధికారులు.