మేడారం మహా జాతర మొదలైంది..

431
- Advertisement -

మేడారం జాతరకు బుధవారం అపూర్వమైన ఏర్పాట్లు. గద్దెల దిశగా పగిడిద్దరాజు పయనం మొదలైంది. ఆ వెనుకే గోవిందరాజు కదులుతున్నాడు. కన్నెపల్లి నుంచి జంపన్నను సంపెంగవాగు దగ్గరున్న రావిచెట్టువద్ద పూజారి పూనం సత్యం ప్రతిష్ఠించారు. ఇక తదుపరి తమ వంతేనని సారక్క, సమ్మక్క సన్నద్ధమవుతున్నారు. పోటెత్తిన భక్తజనంతో మేడారం కిటకిటలాడుతున్నది. ఏ ఒక్క భక్తునికీ అసౌకర్యం కలుగకూడదన్న సీఎం కేసీఆర్‌ విస్పష్టమైన ఆదేశాలతో అధికారులు సమస్తమైన ఏర్పాట్లు జరిపారు. మేడారంలో సమ్మక్క-సారక్క మహాజాతర బుధవారం ప్రారంభమైంది.

అది పల్లె కాదు, పట్టణం కాదు, నగరం అంతకంటే కాదు. అదొక దట్టమైన కీకారణ్యం. అయినప్పటికీ ప్రతీ రెండేళ్లకోసారి అక్కడో మహానగరం వెలుస్తుంది. అది మూడు రోజుల మాత్రమే కనిపించి మాయమయ్యే మహానగరం. ప్రత్యక్షంగా కంటికి కనిపించే మహాత్మ్యం. అదే ‘మేడారం జాతర’. అచ్చంగా చెప్పాలంటే మేడారం జాతరనేది కోట్లాది మంది అట్టడుగు వర్గాల ప్రజల నిఖార్సైన నమ్మకం.

తన జాతి కోసం, నమ్ముకున్న విలువల కోసం ఆదివాసీల స్వయంపాలన కోసం ప్రాణాలనూ త్యజించి..మరణం తర్వాత కూడా జనం గుండెల్లో బతకొచ్చు అని నిరూపించిన వీరవనితలు సమ్మక్క సారక్క. కాకతీయుల పాలనపై కత్తిదూసిన ఆదివాసీ బిడ్డలు ..స్వేచ్ఛాయుత పాలన కోసం కాకతీయ సైన్యంతో పోరాడి వీరమరణం పొందారు. వారిని స్మరించుకుంటూ దశాబ్దాలుగా సాగుతున్న తెలంగాణ కుంభమేళకు సర్వం సిద్దమైంది.

All set for Sammakka Sarakka jathara

జనవరి 31న ప్రారంభం కానున్న ఈ జాతర ఉత్సవాలు.. నాలుగు రోజుల పాటు జరుగుతాయి. తొలిరోజు సారలమ్మ దేవతను మేడారం గద్దెల మీదకు తీసుకు వస్తారు. రెండో రోజు (ఫిబ్రవరి 1)న చిలుకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని కుంకుమ భరిణి రూపంలో గద్దె మీదకు తీసుకువస్తారు. మూడో రోజు (ఫిబ్రవరి 2)న తమ కొంగుబంగారంగా భావించే అమ్మవార్లకు కానుకలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకొంటారు. నాలుగో రోజు(ఫిబ్రవరి 3)న వనదేవతలు తిరిగి వన ప్రవేశం చేయడం ద్వారా జాతర మహోత్సవం ముగుస్తుంది. ఫిబ్రవరి 2న సీఎం కేసీఆర్‌ అమ్మవార్లను దర్శించుకుని మొక్కు చెల్లించనున్నారు.

సమ్మక్క సారక్క జాతరకు విశేష చరిత్ర ఉంది. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే ఈ గిరిజన జాతర…ప్రపంచంలోనే అతిపెద్ధ గిరిజన పండుగ. 1996లో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ జాతర భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగగా గుర్తింపు పొందింది.

మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, యావదాంద్ర దేశములోనే గాక అఖిల భారత దేశములోనే వనదేవతులుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్క. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిషా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

Sammakka Sarakka jathara

12వ శతాబ్దములో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతములోని ‘పొలవాస’ ను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజు కిచ్చి వివాహము చేశారు. మేడారాన్ని పాలించే కోయరాజు “పగిడిద్దరాజు” కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణముగా కప్పము కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడంతో రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణముతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు.

సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటము చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధములో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది.

Sammakka Sarakka jathara

ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యములోనే అదృశ్యమైనది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కాని ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకోసారి జరుగుతుంది.

- Advertisement -