‘‘ప్రేమించడం అంత తేలిక కాదు. ఈ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన విషయం ప్రేమలో పడటం. కానీ అందరూ అత్యంత సులువుగా ‘లవ్’ అనే పదాన్ని వాడేయడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది’’ అని అంటున్నారు శ్రియ. ఆమె ప్రస్తుతం తెలుగులో ‘గాయత్రి’, ‘వీరభోగవసంతరాయలు’ చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళంలో ‘నరగాసురన్’, హిందీలో ‘తడ్కా’ ఈ భామ చేతిలో ఉన్నాయి.
తాజాగా శ్రియ మాట్లాడుతూ ‘‘నా గురించి చాలా మంది చాలా విషయాలు రాస్తుంటారు. అయితే అవన్నీ నిజాలు కావు. నిజమైన విషయాలు వాళ్ల వరకు చేరవు. నాకు ప్రతి విషయం మీదా కచ్చితమైన అభిప్రాయం ఉంటుంది. దాన్ని బట్టే ప్రవర్తిస్తుంటాను’’ అని అన్నారు. సినీ పరిశ్రమలో ఎవరితోనైనా డేటింగ్‌కి వెళ్లారా? అని తనను ప్రశ్నిస్తుంటారని సినీ నటి శ్రియ అసహనం వ్యక్తం చేసింది. డేటింగ్ కి వెళ్లాలంటే ఎదుటివ్యక్తిపైన ప్రేమ ఉండాలని చెప్పింది.
నిజంగా ప్రేమలో పడ్డవారు ఒక్క మాటైనా మాట్లాడుకోకపోయినా రోజంతా ఒకరినొకరు చూసుకుంటూ గడిపేయగలరని చెప్పింది. ‘ఇక హీరోలతో నా డేటింగ్ విషయానికి వస్తే… హీరోలకు రోజులో సగం సమయం అద్దం ముందు చూసుకోవడానికే సరిపోతుంది. మిగిలిన సగం సమయంలో నేను అద్దం చూసుకుంటూ గడిపేస్తాను. ఇక మా మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? డేటింగ్‌కి ఎవరితో వెళ్లాలి?’ అని శ్రియ ప్రశ్నించింది.