నగరంలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. అరాచక చెడ్డీ గ్యాంగ్ దారి మళ్లిందని అందరూ అనుకున్నారు. కానీ…ఆ గ్యాంగ్ ఇప్పుడు మళ్లీ రెచ్చిపోయింది. మంగళవారం (జనవరి-9) రంగారెడ్డి జిల్లా మీర్పేట్ అగ్రికల్చర్ కాలనీలో భారీ చోరీ జరిగింది.
ఓ ఇంట్లో వాచ్‌మెన్‌ను బంధించిన దుండగులు 11 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. అయితే ఇది చెడ్డీగ్యాంగ్ పనిగా అనుమానిస్తున్నారు పోలీసులు.
మొన్నటికి మొన్న సిటీ శివారులోని మియాపూర్ ప్రాంతంలో దోపిడీకి పాల్పడిన చెడ్డీగ్యాంగ్.. ఇప్పుడు మీర్‌పేట అగ్రికల్చర్ కాలనీలో తెగబడ్డారు. దీంతో కాలనీవాసులు భయందోళన చెందుతున్నారు. ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోనూ చెడ్డీ గ్యాంగ్ అరాచకం వెలుగుచూసింది. ఈ గ్యాంగ్ హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలకు జంప్ అయ్యిందని అందరూ అనుకున్నారు. అయితే హైదరాబాద్‌లో ఇంకా అలాంటి గ్యాంగ్‌లు తిరుగుతున్నాయని.. ఇప్పుడు దొరికిన ఆనవాళ్లతో నిర్ధారణ అయ్యిందంటున్నారు పోలీసులు.
ఇక ఇదిలా ఉండగా..వీరంతా ఎక్కువగా తాళం వేసిన ఉన్న ఇళ్ళే లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈ చెడ్డి గ్యాంగుకు మరో పేరు కూడా ఉంది. అదే ‘కచ్చా బనియన్ గ్యాంగ్’. శరీరానికి ఒండు మట్టి గానీ నూనె గానీ రాసుకుని వీరు సంచరిస్తుండటం గమనార్హం.