కరీంనగర్‌లో ఐటీ టవర్

196
- Advertisement -

ఐటీ పరిశ్రమను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించేందుకు ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు మరో ముందడుగు వేశారు. తెలంగాణ జిల్లాల్లోని యువతకు సైతం ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలోని కీలక జిల్లాకేంద్రాలకు ఐటీ పరిశ్రమను విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలోని ఉజ్వల పార్క్ వద్ద రూ.25 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్ నిర్మాణ పనులకు సోమవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పలు ఐటీ కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు.

Minister KTR to Lay Foundation for IT Tower in Karimnagar

అనంతరం జరిగే బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడనున్నారు. జీ ప్లస్ 5గా నిర్మించే ఈ టవర్‌లో మొదటి విడుతగా వెయ్యిమందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీనికి భూమి కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఐటీ హబ్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఐటీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. అక్కడ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సైతం పలువురు ముందుకొచ్చారు. మహబూబ్‌నగర్‌లో కంపెనీల ఏర్పాటుకు 18 సంస్థలు అంగీకార పత్రాలను అందించాయి. ఐటీ విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం ఎన్నారైలను సైతం ఆకట్టుకుంది.

గత ఏడాది పలువురు ఎన్నారైలు ఐటీశాఖ మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను కలిసి తమ ఆసక్తిని తెలియజేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన రూరల్ టెక్ పాలసీలోని ఆకర్షణీయ అంశాలు ఆకట్టుకున్నాయని ఎన్నారైలు సంతోషం వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఇటీవల జరిపిన ఆస్ట్రేలియా పర్యటనలో దాదాపు 60 కంపెనీలు రాష్ర్టానికి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేశాయి. టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియాశాఖ అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి కాసర్లతో కలిపి జరిపిన భేటీలో ఆరు కంపెనీలు నిజామాబాద్, కరీంనగర్‌లో కంపెనీలు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తూ లేఖలు ఇచ్చాయి.

- Advertisement -