‘శ్రీవారి’ బ్రహ్మోత్సవ మహాప్రదర్శన

343
- Advertisement -

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన ”శ్రీవారి బ్రహ్మోత్సవ మహాప్రదర్శన” భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తోందని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు డా|| చదలవాడ కృష్ణమూర్తి, కార్యనిర్వహణాధికారి డా||డి.సాంబశివరావు వెల్లడించారు. ”శ్రీవారి బ్రహ్మోత్సవ మహాప్రదర్శన”ను సోమవారం ఉదయం తితిదే ఛైర్మన్‌, ఈవో ప్రారంభించారు.

ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్‌ మాట్లాడుతూ ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌, తితిదే ప్రచురణల ప్రదర్శన, విక్రయం, ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఫలపుష్ప ప్రదర్శన, ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఎస్వీ మ్యూజియం ప్రదర్శన, శ్రీవేంకటేశ్వర శిల్పకళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిల్పకళా ప్రదర్శనలను ప్రారంభించినట్టు తెలిపారు. వినూత్నంగా ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శనలను భక్తులు తిలకించి తరించాలని కోరారు.

ttd

తితిదే ఈవో డా|| డి.సాంబశివరావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులందరూ ఈ ప్రదర్శనశాలలను తిలకించి తరించాలని కోరారు. ఫలపుష్ప ప్రదర్శనలో ఏర్పాటుచేసిన పౌరాణికాంశాల సెట్టింగులు, ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తిరుమల చరిత్రను కళ్లకు కట్టే ఫొటోలు ఆకట్టుకుంటున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల అధికారులను ఈవో అభినందించారు.

tirumala

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రసారమాధ్యమాలు, పత్రికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చూపాలని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు డా||చదలవాడ కృష్ణమూర్తి మీడియా ప్రతినిధులను కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల మొదటిరోజైన సోమవారం ఉదయం తిరుమలలోని రాంభగీచా-2 విశ్రాంతిగృహంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్‌ను తితిదే ఈవో డా||డి.సాంబశివరావుతో కలిసి ఛైర్మన్‌ ప్రారంభించారు.

ttd

ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులను దైవసమానులుగా భావించి సేవలందించేందుకు అన్ని విభాగాల ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. భక్తుల సంఖ్య పెరిగినా తితిదేకి ఉన్న అనుభవంతో ఏర్పాట్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి పత్రికలు, ఛానళ్లలో ఎక్కువగా ప్రచారం చేయాలని కోరారు. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి మూలవిరాట్టు దర్శనంతోపాటు వాహనసేవల దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. మీడియా సెంటర్‌లో భోజన సదుపాయంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, ఫ్యాక్స్‌, టెలిఫోన్‌ వసతి కల్పించామని, మీడియా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

tirumala

తితిదే కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు మాట్లాడుతూ తితిదేకి చెందిన ఎస్వీబీసీ, సప్తగిరి మాసపత్రికతోపాటు ఇతర ఛానళ్లు, పత్రికలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. మరింత నాణ్యంగా ధర్మప్రచార కార్యక్రమాలు, ఎస్వీబీసీ ప్రసారాలు చేస్తున్నామని వివరించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏరోజుకారోజు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్టు చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు మీడియా సెంటర్‌లో వివిధ విభాగాల అధికారులు మీడియా సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే మీడియా తమ దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరిస్తామన్నారు. గరుడసేవ నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, భక్తులు ఆందోళనకు గురికాకుండా మీడియా ప్రతినిధులు తగిన జాగ్రత్తలు తీసుకుని కథనాలు ప్రసారం చేయాలని ఈవో కోరారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రీ మణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో తితిదే ధర్మకర్తల మండలి సభ్యులు డా|| బాలవీరాంజనేయ, డిఎఫ్‌ఓ శ్రీశివరామ్‌ప్రసాద్‌,.ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -