తెలంగాణలో 23 లక్షల పంపుసెట్లకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను చేయడానికి విద్యుత్ సంస్థలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.01 గంటల నుంచి రైతులకు 24 గంటల విద్యుత్‌ను అందించనున్నారు.
వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణ కొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాలు 9 గంటల పాటు ఉచిత కరెంట్ ఇవ్వగా తెలంగాణ ప్రభుత్వం మాత్రమే 24 గంటల పాటు ఉచితంగా కరెంట్‌ని ఇవ్వడం విశేషం.
2016 జూలై నుంచి ప్రయోగాత్మకంగా పాత మెదక్,నల్గొండ,కరీంనగర్ జిల్లాల్లో 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించారు. ఆ తర్వాత 2016 నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని 23 లక్షల పంపుసెట్లకు ఉచిత కరెంట్ అందించి సక్సెసయ్యారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో 2018 జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ సమయంలోనే విద్యుత్ సరఫరాలో మెరుగైన ఫలితాలు సాధించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. 24 గంటల కరెంట్ అందించడం ద్వారా తెలంగాణ ఖ్యాతి మరింత పెరిగిందన్నారు. విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉంటేనే రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా నిలిచిందన్నారు.