సెక్యులర్ పదాన్ని తొలగిస్తాం..

239
- Advertisement -

కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే  మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. భారత రాజ్యంగం నుంచి లౌకికతత్వం అనే పదాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన లౌకకివాదులపై విరుచుకపడ్డారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిందే సెక్యులర్ పదాన్ని తీసేయడానికని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని పలుమార్లు సవరించారన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించిన ఆయన మీరు ముస్లింలు, క్రైస్తవులు లేదా వేరే మతాలకు చెందిన వారు అయితే ఆ మతంతో, కులంతో సంబంధం కలిగివున్నందుకు గొప్పగా భావించండి. అంతేకానీ, అసలు ఎవరీ లౌకికవాదులు?. లౌకికవాదులకు తల్లిదండ్రులు లేరు  అని వ్యాఖ్యానించారు.

Ananth Kumar Hegde

ప్రగతిశీల భావాలు ఉన్నవారికి చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి తెలియదని, వారు తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఇతరులను తప్పుగా చిత్రీకరిస్తారని మంత్రి విమర్శలు చేశారు. అయితే మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి.  కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ..అనంత్‌ కుమార్‌ పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.  అనంత్‌కుమార్‌కు సంస్కృతి, పార్లమెంటరీ వ్యవహారాలు తెలియవన్నారు. ఆయన పంచాయతీ సభ్యుడిగా కూడా పనికిరారని ఆరోపించారు.

అనంత్‌కుమార్‌ హెగ్డేకు మతిస్థిమితం తప్పింది. అధికారం తలకెక్కింది. అందుకే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని కేపీసీసీ కార్యాధ్యక్షుడు దినేష్‌ గుండూరావ్‌ మండిపడ్డారు.  రాజ్యాంగాన్ని కాపాడతానని, రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకుంటానని ప్రమాణం చేసిన వ్యక్తి ఇప్పుడు ఆ ప్రమాణానికే విలువ ఇవ్వడం లేదని విమర్శించారు.

అనంత కుమార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఇస్లాం మతాన్ని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఈ ఏడాది నవంబర్‌లో జరిగిన టిప్పు సుల్తాన్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన నిరాకరించారు.

- Advertisement -