నిత్యకల్యాణం పచ్చతోరణంగా వెలిగిపోయే క్షేత్రం తిరుమల కొండ. ఏడుకొండలవాడికి నిత్యం ఉత్సవమో ఊరేగింపో జరుగుతూనే ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది శ్రీవారి క్షేత్రం.సంవత్సరం మొత్తం ఎన్ని ఉత్సవాలు జరిగినా బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రత్యేకతే వేరు. బ్రహ్మదేవుడే స్వయంగా ఈ ఉత్సవాలను జరిపిస్తాడని చెబుతున్నాయి పురాణాలు. సృష్టికర్త బ్రహ్మాదేవుడు జరిపిన ఉత్సవాలు కాబట్టే ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయట. ప్రతి ఏటా నిర్ణీత తిథుల్లో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని… ఆ అరవింద దళాయతాక్షుని అభయ ప్రధానం పొందాలని భక్తకోటి తహతహలాడుతుంటుంది. అలంకార ప్రియుడైన శ్రీనివాసుని ఊరేగింపు చూసిన ప్రతి భక్తుని మదీ ఇక చాలు ఈ జన్మమిక చాలు అన్నట్లుగా భక్తపారవైశ్యంతో తేలియాడుతుంది.
నేటి నుంచి అక్టోబర్ 3 నుంచి 11 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సాయంత్రం జరిగే అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకున్ని టీటీడీ భారీగా ఏర్పాట్లు చేసింది. వాహన సేవలు జరిగే మాడ వీధుల్లో విద్యుత్‌దీపాలను ఏర్పాటు చేశారు. అలాగే సప్తగిరులను సర్వాంగసుందరంగా అలంకరించారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో దాతలకు మాత్రమే గదులు కేటాయిస్తామని టీటీడీ ప్రజాసంబంధాల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. గదులు కావాల్సిన కాటేజీ దాతలు 5 రోజుల ముందుగానే సెల్ఫ్ డోనార్ స్లిప్పులు తిరుమలలోని రిసెప్షన్-1, ఉప కార్యనిర్వహణాధికారికి సమర్పించాలి. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రద్దీ కారణంగా 6, 7 తేదీల్లో దాతలకు కూడా గదులు కేటాయించడం లేదని తెలిపింది.
బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో గదుల అడ్వాన్స్ బుకింగ్‌ను టీటీడీ రద్దు చేసింది. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో సాంబశివరావు, నిర్ణయించారు. సిఫారసు లేఖలు కూడా మంజూరు రద్దు చేశారు. సిఫారసుల్లో కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే గదులు మంజూరు చేయనున్నారు.
దేశంలోనే తొలిసారిగా తిరుమలలో ప్రహరి కళాత్మక ఉద్యాన వనాలు ఏర్పాటు కానున్నాయి. భక్తుల్లో భక్తి భావం పెంచేలా శ్రీవారు, శంఖు చక్రాలు, ఆనంద నిలయంతో పాటు రంగురంగుల ఆకులు (ఫోలియేజ్), పుష్పాలతో ఈ ప్రహరి కళాత్మక ఉద్యాన వనాలను తీర్చిదిద్దనున్నారు.