శివసేన అధినేత బాల్‌ఠాక్రేకు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు మధ్య మంచి స్నేహం ఉంది. బాల్‌ఠాక్రే జీవితాధారంగా వచ్చిన ‘సర్కార్’, ‘సర్కార్ రాజ్’, ‘సర్కార్ 3’ చిత్రాల్లో ఠాక్రే పాత్రలో అమితాబ్ నటించారు. ఇప్పుడు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఠాక్రే జీవితాధారంగా మరో బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. దీనికి ‘ఠాక్రే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గురువారం ముంబయిలో ఈ చిత్ర ఫస్ట్‌లుక్, ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు. ఈ సందర్భంగా అమితాబ్..తనకు బాల్‌ఠాక్రేతో ఉన్న అనుబంధం గురించి వివరించారు.
‘బోఫోర్స్ కుంభకోణం విషయంలో నీకేమన్నా సంబంధం ఉందా అని ఓసారి బాల్ ఠాక్రే నన్ను ప్రశ్నించారు. నాకు అసలు ఎలాంటి సంబంధం లేదని నాపై వస్తున్నవన్నీ ఆరోపణలేనని చెప్పాను. అప్పుడు ఆయన ‘భయపడకు నీకు నేనున్నాను’ అని ధైర్యం చెప్పారు. అంతేకాదు ‘కూలీ’ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ఆయన చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు.
ఆ ప్రమాదంపై అమితాబ్ మాట్లాడుతూ, అప్పుడు తన ప్రాణాలు కాపాడింది శివసేన అధినేత, దివంగత బాల్ థాక్రే అని చెప్పారు. అప్పుడు బాగా వర్షం పడుతోందని, అంబులెన్స్ లు కూడా లభించే పరిస్థితి లేదని, చివరకు శివసేనకు చెందిన అంబులెన్సే తనను ఆసుపత్రికి తీసుకెళ్లిందని తెలిపారు. థాక్రే చనిపోవడానికి ముందు, ఆయనకు చికిత్స జరుగుతున్న గదిలోకి వెళ్లానని, అలాంటి స్థితిలో ఆయనను చూసి తట్టుకోలేక పోయానని అమితాబ్ చెప్పారు.