మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ఇంటింటికీ తాగునీరిచ్చే రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ చేతుల మీదుగా అర్బన్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న కేటీఆర్.. సీఎం కేసీఆర్ దిశానిర్దేశానికి అనుగుణంగా ముందుకెళ్లే క్రమంలో ఈ అవార్డు వచ్చిందని భావిస్తున్నా అని తెలిపారు. పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.
మూడున్నరేండ్ల కిందట తెలంగాణలో విద్యుత్ లోటు ఉండేదని, పారిశ్రామిక, వ్యవసాయ, గృహావసరాలకు విద్యుత్ కొరత ఉండేదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే విద్యుత్ సమస్యను అధిగమించినట్టు తెలిపారు. 2018 జనవరి 1 నుంచి సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వగలిగే స్థాయికి ఎదిగామని మంత్రి చెప్పారు.
దేశంలో సాగుకు 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయగలిగిన తొలిరాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, విద్యుత్‌రంగంలో ప్రథమస్థానంలో ఉన్నదని, సోలార్ ద్వారా 3వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధిస్తున్నామని తెలిపారు.
పట్టణాభివృద్ధి, స్వచ్ఛత, మౌలిక సదుపాయాల కల్పన, ఉత్తమ నగరాలుగా ప్రతిభ కనబరిచిన సంస్థలకు, నగరాలకు, వ్యక్తులకు బిజినెస్ వరల్డ్ సంస్థ అవార్డులు ప్రకటించగా.. అందులో తెలంగాణకు రెండు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. అర్బన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మంత్రి కేటీఆర్ అందుకోగా, పట్టణాభివృద్ధికి మౌలిక వసతులు కల్పిస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు దక్కిన మరో అవార్డును రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్ అందుకున్నారు.
Delighted to receive the Business World award for Urban Leader of the Year along with @RaoKavitha @VishweshwarRed1 from Sri @HardeepSPuri Ji pic.twitter.com/warkTLXWMj
— KTR (@KTRTRS) December 20, 2017