మినీ లోకసభ ఎన్నికలను తలపించిన గుజరాత్ సంగ్రామంలో బీజేపీ పై చేయి సాధించింది. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల మధ్య పోటాపోటీగా సాగిన ప్రచారంలో కాషాయ పార్టీ తిరిగి అధికారాన్ని కాపాడుకోవడంలో సక్సెస్ అయింది. అయితే ఈ గెలుపు బీజేపీ,మోడీకి ఊరట నిచ్చిన ఆ పార్టీలో మాత్రం జోష్ నింపలేదు.
హోరాహోరిగా సాగిన పోరులో బీజేపీ స్వల్ప ఆధిక్యంతో విజయతీరాలకు చేరింది. మిషన్ 150తో బరిలోకి దిగిన బీజేపీ గత ఎన్నికల్లో గెలిచిన సంఖ్యను కూడా చేరుకోలేకపోయింది. బీజేపీ గెలుపు కోసం మోడీ ఎన్నడూలేనంతగా శ్రమపడాల్సి వచ్చింది. మోడీ అంటే అభివృద్ది అని ప్రచారం చేసుకునే బీజేపీ నేతలు ఒకానొకదశలో గుజరాత్లో గెలుస్తామా అన్న సందిగ్దంలోకి వెళ్లిపోయారు.
ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో ఎక్కువగా నష్టపోయింది గుజరాతే. వ్యాపారస్తుల్లో సైతం బీజేపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ పరిస్ధితుల్లో బీజేపీ విజయం నల్లేరుపై నడక ఏమాత్రం కాదని అర్థమైపోయింది. దీంతో రంగంలోకి దిగిన మోడీ అంతా తానై నడిపించారు.
పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్,దళిత నేత జిగ్నేష్ మేవానీ, ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ బీజేపీపై ముప్పేటదాడికి దిగారు. దీంతో మొదట్లో అభివృద్ధి నినాదంతోనే మోడీ బరిలోకి దిగారు. రోడ్లు, సాగు, తాగునీరు, శాంతిభద్రతలు, విద్యుత్ సరఫరా, విద్యాభివృద్ధి, పారిశ్రామికీకరణ.. ఇలా ప్రతి రంగంపై బీజేపీ అభివృద్ధి మోడల్‌ను వివరిస్తూ వెళ్లారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగానే నోట్ల రద్దు,జీఎస్టీ లాంటి ఆర్థిక విధనాలు తీసుకొచ్చానని వివరించే ప్రయత్నం చేశారు.
దీనికి తోడు తన ప్రచార పర్వానికి కాస్త హిందుత్వ టచ్ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే ఇక ముస్లిం రాజ్యమే అన్నట్లుగా ప్రచారం నిర్వహించారు. అయోధ్యకు, ఎన్నికలకు ముడిపెట్టిన కపిల్ సిబల్ వ్యాఖ్యలను అనుకూలంగా మలచుకున్నారు. ఇక గుజరాత్లో తనను ఓడించడానికి కాంగ్రెస్ ఏకంగా పాకిస్థాన్‌తోనే చేతులు కలిపిందన్న ఆరోపణ అసలు మోదీ ప్రచారానికే హైలైట్‌గా నిలిచింది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా చివరగా కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన నీచ్ కామెంట్స్ బీజేపీకి ఆయుధంలా దొరికింది. మొత్తంగా గుజరాత్లో ఆరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయినా ఫలితాలతో మాత్రం బీజేపీ నేతలు నిరాశ చెందారు.