తెలంగాణలో మౌళిక వసతుల యంత్ర పరికరాల తయారీ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. భవన నిర్మాణాలు, ప్రాజెక్టులు, మైనింగ్ వంటి మౌళిక వసతుల పనుల్లో ఉపయోగించే పరికరాల తయారీకి ప్రత్యేకంగా ఒక పార్కు అనేది దేశంలో మెదటిసారి తెలంగాణలో ఏర్పడనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పార్క్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, శ్రేయి ఇన్ప్రాస్టక్చర్ కంపెనీ (ఒట్టివో ఏకాణమిక్ జోన్స్ ) తో ఒక అవగాహన ఒప్పందాన్ని ఈరోజు(బుధవారం) కుదుర్చుకుంది.
బెంగుళూరులో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మరియు మాన్యూఫాక్చరింగ్ జోన్ లో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ యంత్ర పరికరాల తయారీ యూనిట్ల కోసం పార్కు ఏర్పాటు చేస్తారు. ఈ రంగంలో పేరున్న Original equipment makers( OEM’s) ఈ పార్కులో తయారు యూనిట్లను ఏర్పాటు చేస్తారని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, శ్రేయి ఇన్ప్రాస్టక్చర్స్ కంపెనీ ఉమ్మడి భాగసామ్యంలో ఏర్పాటు అయ్యే ఈ పార్కులో పెట్టుబడిదారులు, కార్మికులు, కస్టమర్లకు అవసరం అయిన (వర్క్ to play పద్ధతిన ఏర్పాటయ్యే ఈ పార్కులో) అన్ని సౌకర్యాలు ఉంటాయని మంత్రి కేటీ రామారావు తెలిపారు.
ఈ పార్కు ఏర్పాటు ద్వారా రానున్న పది సంవత్సరాల్లో ప్రత్యేక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 10 వేల ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ పార్కులో పెట్టుబడులతో వచ్చే తొలి 5 యాంకర్ పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇచ్చే సాధారణ రాయితీలకు అదనంగా మరిన్ని రాయితీలను అందిస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఈ పార్కులో పెట్టుబడులను పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపిన మంత్రి మరిన్ని కంపెనీలు తెలంగాణకు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ పార్కుకు సంబంధించిన భూ సేకరణ పూర్తయిందని, త్వరలోనే ఈ పార్క్కు లాంఛనంగా శంకుస్థాపన చేస్తామన్నారు.
శ్రేయి ఇన్ప్రాస్టక్చర్ కంపెనీ ఉపాధ్యక్షులు సునీల్ కనోరియా మాట్లాడుతూ గత రెండున్నర దశాబ్దాలుగా తమ కంపెనీ మౌలిక వసతుల రంగంలో అనేక పెట్టుబడులు పెడుతున్నదని, ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న ఈ పార్కు ద్వారా తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతమై, వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. విప్లవాత్మకమైన పాలసీలతో ముందుకు వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఈ పార్క్ ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.