గుజరాత్ శాసనసభ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని 89 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 14న మిగిలిన స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.
తొలివిడత ఎన్నికల బరిలో గుజరాత్ సీఎం విజయ్ రూపాని సహా 977 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రనిల్ రాజ్‌యాగు రు ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. జీతూ భాయి వాఘాని, శక్తి సింగ్ గోహిల్, అర్జున్ మోద్వాడియా తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 1985 నుంచీ పశ్చిమ రాజ్ కోట్ బీజేపీకి కంచుకోటగా ఉంది. మణినగర్‌కు వెళ్లకుమందు 2002లో ప్రధాని మోడీ ఇదే స్థానం నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు.
కాగా,తొలి దశ ఎన్నికల్లో అధికార బీజేపీ మొత్తం 89 స్థానాల్లో పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ రెండు స్థానాలు మినహా 87 స్థానాల్లో బరిలో ఉంది. ఇక బీఎస్పీ 64, ఎన్సీపీ 30 స్థానాల్లో పోటీపడుతోంది.
2012లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం తొలి దశ జరుగుతోన్న 89 స్థానాల్లో 63 చోట్ల బీజేపీ గెలవగా, 22 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. కానీ పటేళ్ల హక్కుల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడంతో.. హస్తం పార్టీ ఈ దఫా గణనీయంగా పుంజుకుంది. తొలిదశలోని 31 స్థానాల్లో 20 శాతం పటేల్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లే ఉండటం గమనార్హం.