మీరు చదివింది నిజమే..సాక్ష్యాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నోటివెంట పప్పు మాట వచ్చింది. అయితే మీరనుకున్నట్లు పప్పు అంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ,ఏపీ మంత్రి నారా లోకేష్ గురించి కాదు. మనం తినే పప్పు గురించి. ఒబామా ఫౌండేషన్ తరపున భారత్ వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియా ఫేవరెట్ డిష్ అయిన పప్పు ఎలా చేయాలో తెలిసిన ఏకైక అమెరికా అధ్యక్షుడిని తానే అని ఒబామా చెప్పారు.
2017 జనవరి 25న భారత్ వచ్చిన ఒబామా భారతీయ వంటకాల రుచులను చవిచూశారు. హోటల్లో ఉన్న సమయంలో ఓ వెయిటర్ తనకు పప్పు వడ్డించి.. అది ఎలా చేస్తారో చెప్పే ప్రయత్నం చేశాడని ఒబామా తెలిపారు. తాను చేసిన కీమా,చికెన్ కూడా అద్భుతంగా ఉంటుందని ఒబామా అన్నారు. చపాతీ చేయడం వచ్చా అని కరణ్ థాపర్ ఆయనను ప్రశ్నించగా.. అది అస్సలు రాదు…చపాతీ చేయడం చాలా కష్టమంటూ ఒబామా చెప్పారు.
ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పుకొచ్చిన ఒబామా అమెరికాది అత్యంత పురాతన ప్రజాస్వామ్యం అని భారత్ ది అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే సత్తా ఇంటర్నెట్ కు ఉందని…రాజ్యాంగంలో ఉన్న విలువలను ప్రతి రోజు మనం ప్రచారం చేయాలన్నారు. భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలన్నారు. మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని పేద-ధనికుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉగ్రవాద చర్యలు ఎలాంటి వారినైనా ఇబ్బంది పెడతాయని ఒబామా అన్నారు. ముంబై దాడుల తర్వాత తాము ఈ రకంగా ఆలోచన చేశామని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ అంతే వ్యక్తిగతంగా తనకు అభిమానమని, ఆయన దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఒబామా పేర్కొన్నారు.